Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/300

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బ్రహ్మచర్యం నడపవచ్చుగదా అనుకుంటే అటువంటివాడికి ఏ సిద్ధి, బుద్ధి చాలదా అని శంక కలుగుతుంది. అందువల్ల ఈ బహుపత్నీత్వ బ్రహ్మచర్యం హాస్యాభిమానాన్ని వెల్లడిస్తున్నది. సాహిత్య గ్రంథాలు పరికిస్తే ప్రత్యేకంగా ఈ రసాభిమానం ఆయనకు చిన్ననాడే అలవడ్డది. అప్పకవి చెప్పిన ఆయన చిన్ననాటి చేష్ట యిందుకో గొప్ప ఉదాహరణ - "తను గని యెత్తుననె దక్షజయం, నిటలాక్షుడు, మ్ముదంబున నిరు చెక్కులం గదిసి ముద్దు గొనంగ, నొకింత నెమ్ముగ బనువుగ వెన్కకుం దిగిచి, యత్నవిహీన పరస్పరాస్యచుంబనములు, తల్లిదండ్రులకు బన్నుగ గూర్చు, గజాస్యు గొల్చెదన్.”

భారతదేశంలో వినాయకుణ్ణి హిందువులు, బౌద్ధులు, జైనులు మూడు మతాలవారూ కొలుస్తున్నారు. ఈ దేవతామూర్తి కేవలం భారతదేశంలోనే కాదు, నేపాళము, చైనీయ తుర్కీ స్థానము తిబ్బత్తు, బర్మా, సయాం, ఇండోచైనా, జపానుదేశాల్లో భక్తవత్సలుడై పూజాదికాలను అందుకుంటున్నాడు. హీనయానబౌద్ధులు గణాధిపతిని ఎరుగరు. ఆయన మహాయాన వజ్రయాన బౌద్ధాలలో ప్రవేశించాడు. బుద్ధ భగవానుడు రాజగృహంలో, గణేశ శక్తిగా భావితమౌతూ వున్న గణేశ మహామంత్రాన్ని ప్రియశిష్యుడైన ఆనందునికి చెప్పినట్లు, మహాయానబౌద్దులు పలుకుతున్నారు. వారి సంప్రదాయంలో ఈ మంత్రానికి గణేశ హృదయమని నామం'. నేపాళము, తిబ్బత్తులలో ఉన్న శిల్పంలో ఆయన విగ్రహాలు అనేక రీతులలో శిల్పితాలై ఉన్నవి. వాటిలో ఆయన కేవలం ఒక దేవతామూర్తి మాత్రమే కాడు, బౌద్ధ దేవతలందరితో పోరాడే రాక్షస శ్రేష్ఠుడు. చైనీయులు, జపానీయులు గణపతిని రూపద్వయ మూర్తినిగా దర్శించి శిల్పించుకున్నారు. ఆ రెండు రూపాలలో ఒక రూపం భారతదేశంలో సర్వసామాన్యంగా కనిపిస్తున్నది. రెండవ రూపానికి ఉదాహరణలు భారతదేశంలో లేవు. అది 'అర్ధనారీ - గణపతి' మూర్తి. భారతదేశంలో గణాధిపతి విద్యాధనదేవత, క్షేత్రపాలకుడు. గ్రామాలకు నలుమూలలా వుండి ఆయన రక్ష చేస్తుంటాడు. శాక్తేయం ప్రబలిన కాలంలో దాని ప్రభావం వల్ల తంత్ర గ్రంథజాలం అభివృద్ధి పొందింది. వాటి ప్రభావం బౌద్ధంలో ప్రవేశించిన కాలంలో ఇటువంటి 'అర్ధనారీ గణపతి' రూపాన్ని శిల్పి దర్శించి ఉంటాడని ప్రతిమా శాస్త్రజ్ఞులు (iconographists) అభిప్రాయ మిస్తున్నారు.

రుద్ర గణాలకు అధిపతి గణపతి. అథర్వశిరోపనిషత్తులో రుద్రుడే గణపతి అయినట్లు ఒక సూక్తం కనిపిస్తున్నది. మహాభారతం ఆనుశాసనిక పర్వంలో కొందరు గణేశ్వరులూ, వినాయకులు కొందరూ వున్నారు. శతరుద్రీయంలో గణపతి