శ్రీగణపతి
"గణానాం గణపతిగ్ం హవామహే
కవిం కవీనా ముపమశ్రవ స్తమమ్ |
జ్యేష్ఠరాజమ్ బ్రహ్మణామ్ బ్రహ్మణస్పత
ఆనః శ్రుణ్వ న్నూతిభిః సీద సాదనమ్ ||" ఋగ్వేదము 11-28-1
“ఈ సమస్తమైన దేవతాగణాలన్నిటికీ నీవే ప్రభువు, నాయకుడవు, బుద్ధిమంతులలో నీవే బుద్ధిమంతుడవు. ప్రఖ్యాత పురుషుల్లో అగ్రగణ్యుడవు. మా ప్రార్థనలూ, పూజలూ, యజ్ఞాలూ మొదలైన సమస్త కర్మలకూ నీవే రాజువు ఓ బ్రహ్మణస్పతీ! యజ్ఞస్థానాన్ని అధిష్ఠింపుము.”
గణపతి విఘ్నకర్తగానూ, విఘ్నహర్తగానూ భక్తగణాల పూజ లందుకుంటున్న దేవతామూర్తి. అయితేనేం, విఘ్నేశ్వరుడి పెళ్ళికి వేయి విఘ్నాలన్న సామెత తెలుగుదేశంలో నిత్యమూ ప్రచలితమౌతున్నది. ఈ విఘ్నాలను హాస్యరస ప్రియుడైన ఆయన కల్పించుకున్నవేనా? సమస్తకార్యారంభాలలో విఘ్ననాథుణ్ణి కొలవవలసిన ఆచారం భారతీయులలో ఉంది. అది ఆయన జన్మించినప్పటినుంచీ వచ్చి ఉంటుందా? ఆయనకు తల్లిదండ్రులైన పార్వతీపరమేశ్వరుల వివాహానికి విఘ్నేశ్వరపూజ సప్తర్షులు జరిగించినట్లున్నది. ఇదేమిటి, ఇటువంటి వైరుధ్యాలే ఆయన రూప విషయంలోనూ ఎన్నో గోచరిస్తున్నవి. అంతటి మహామూర్తికి ఆ మూషకవాహనం ఎక్కడ చాలుతుంది? ఇదీ హాస్య ప్రియత్వమా? ఏకదంతం, శూర్పకర్ణద్వయం, గజాననం ఇత్యాది లక్షణాలను పేర్కొంటున్న ఆ అష్టోత్తర శతాలే ఆయన్ను నవమన్మథుడని స్తుతిస్తున్న వేమిటి? దేవగణాధిపత్యానికి, హాస్యరస ప్రియత్వానికి ఏ దిక్కుకే దిక్కు? అందుకనే భావుకులకు వినాయకుణ్ణి (విశేషమైన నాయకుడు, విశిష్టమైన నాయకుడు) వైరుధ్యాలకు ఒక సంజ్ఞామూర్తి (Symbol of Incongruieties) గా మన ప్రాచీనులు భావించి రూపకల్పన చేసి ఉంటారని తలపోయటానికి అవకాశం కలుగుతున్నది.
ఆయన బ్రహ్మచారిట! అయితేనేం సిద్ధి, బుద్ధి ఇద్దరూ ఆయన భార్యలు. ఇదీ ఈ హాస్య రసాధిదేవతకు ఉచితమైన చేష్టగానే కనిపిస్తున్నది. గృహస్థాశ్రమంలో ఉండి