'మద్భక్తా యత్ర గాయన్తి, తత్ర తిష్టామి నారద!' అన్న ప్రమాణ వాక్యానికనుగుణంగా భక్తాధీనుడైనాడు. తనకంటే తన భక్తులను అధికం చేసి దాస, దాసో హ సంప్రదాయానికి కారణ భూతుడైనాడు. శిశుపాలాది వైరభక్తులకు సైతం మోక్షప్రదానం చేసిన ప్రభువైనాడు.
"యే యథా మాం ప్రపద్యన్తో తాం స్తథైవ భజామ్యహమ్ । మమ వర్మాను వర్తన్తో మనుష్యాః పార్థ! సర్వశః ॥
ఎవరు ఏ మార్గంలో సేవించినా నన్ను చేరుతారని మహోదారదైవమై ప్రవచించాడు. ఆయన ప్రభుతా విశేషాలను, భక్త జనమార్గ వైవిధ్యాలను వెల్లడించే భక్తి శాస్త్రం భాగవతం.
'విద్యావతాం భాగవతే పరీక్షా' నేను విద్యావంతుడనన్న వాడిని భాగవతంలో పరీక్షించటం భారతదేశంలోని విద్వత్సంప్రదాయం. ఇంతటి మహోదాత్తత గల గ్రంథం కావటం వల్లనే, భక్తకవి సత్తముడైన మహాకవి పోతన భాగవతాన్ని ఇలా కీర్తించాడు.
మ. "లలిత స్కంధము కృష్ణమూలము శుకా లాపాభిరామంబు మం జులతాశోభితమున్, సువర్ణసుమన స్సుజ్ఞేయమున్ సుందరో జ్జ్వలవృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాలవాలంబు నై వెలయున్ భాగవతాఖ్య కల్పతరువు ర్విన్ సద్ద్విజ శ్రేయమై.”
శ్రీకృష్ణుడు : గీతాచార్యుడు
మహాభారత రణరంగంలో ఉభయపక్షాల మధ్య అష్టాదశ అక్షౌహిణీదళాలు మోహరించి నిలచినవేళ విభ్రాంతుడు, మహావేశ వివశుడు, కింకర్తవ్యతావి మూఢుడు, యుద్ధ యాగారంభ విముఖుడునై పార్థుడు అస్త్ర సన్యాసం చేసినప్పుడు, పార్థసారథి తన నారాయణత్వాన్ని ప్రకటిస్తూ అనుగ్రహ బుద్ధితో, అల్ప సమయంలో సదసద్వి జ్ఞాన రూపమైన ఉపనిషత్ సారాన్ని గీతారూపంలో ఉపదేశం చేసి, అతనిచేత కదనభూమిలో వీరవిహారం చేయించి విజయాన్ని చేకూర్చాడు. పిండీకృత విజ్ఞాన పుంజమైన గీతను ఉపదేశించిన మార్గాన్ని అనుసరించడం వల్ల కలిగే ప్రయోజనాలను సంజయుడు ధృతరాష్ట్రుడికి 'ఏకశ్లోకీ భగవద్గీతా' అన్న ఈ క్రింది శ్లోకంలో ఇలా ఉపదేశించాడు.
"యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్టో ధనుర్ధరః | తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతి ర్మతిర్మమ ॥