ఎక్కడ యోగేశ్వరుడైన కృష్ణుడు, * ధనుర్ధారియైన అర్జునుడు ఉంటారో అక్కడ సంపద, విజయం, ఐశ్వర్యం, దృఢమైన నీతి ఉంటాయి. ఇంతటి మహత్తు కలిగిన గ్రంథం కావటం వల్లనే భారతీయ తత్త్వవేత్తలు వేదాంత శాస్త్రానికి ప్రమాణ గ్రంథాలైన “ప్రస్థానత్రయం”లో ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలతో బాటు ఈ గీతను కూడ చేర్చారు. భారతదేశంలో పుట్టి వేదప్రామాణ్యాన్ని అంగీకరించే సమస్తమతకర్తలు, అద్వైత విశిష్టాద్వైతాది సంప్రదాయ మతాచార్యులు, తమ తమ సిద్ధాంతాలకు అనుగుణంగా గీతకు వ్యాఖ్యానాలు వ్రాసి ప్రచారం చేశారు. ప్రాచ్య పాశ్చాత్యమైన ఆధునిక వైజ్ఞానిక ప్రపంచం చేత సర్వసంశయవిచ్ఛేదం చేయగలిగి సత్యార్థ ప్రకాశకమైన ఏకైక తత్త్వ గ్రంథంగా స్వీకరింపబడి గీత ఈ నాడు జేగీయమానమవుతున్నది.
ఈ సందర్భంలో గీతా మహాత్మ్యంలోని క్రింది రెండు శ్లోకాలను స్మరించడం సముచితం.
“సర్వోపనిషదో గావోదోగ్ధా గోపాలనందనః । పార్థో వత్సః సుధీ ర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్ ||” "సంసార సాగరం ఘోరం తరుమిచ్ఛతి యో నరః | గీతానావం సమాసాద్య పారంయాతి సుఖేన సః ||
ఉపనిషత్తులన్నీ గోవులు. శ్రీకృష్ణుడు పాలు పితుకువాడు. అర్జునుడు దూడ. మహత్తరమైన గీతామృతమే క్షీరము. బుద్ధి సంపన్నుడే ఆ పాలను త్రాగువాడు. ఘోరమైన సంసార సముద్రాన్ని దాటదల్చుకొన్న మానవుడు భగవద్గీత అనే నౌకను పొందగలిగితే సులభంగా ఆవలిఒడ్డుకు చేరగలడు.
శ్రీకృష్ణార్పణమస్తు
శ్రీ కృష్ణ భగవానుడు యోగేశ్వరుడనీ అష్టభార్యలతోను, షోడశసహస్ర వనితాజనంతోను గోపికాంగనలతోను విలాసలీలల్లో మునిగి తేలినా అస్ఖలిత బ్రహ్మచారి అని, ఆయన జీవయాత్ర 'పద్మ పత్రమి వాంభసామ్' అన్న రీతిలో సాగిందని, మహాద్రష్టలైన మహర్షి సత్తములందరూ ఏకగ్రీవంగా అంగీకరించడం జరిగింది. ఈ విశేషాంశాన్ని అవగతం చేసికోటానికి సాంప్రదాయిక పరిజ్ఞాన సంపత్తితో కూడిన వివేచనసామర్థ్యం ఎంతైనా అవసరం. కేవల లౌకిక విజ్ఞానవేత్తలకు అర్థమయ్యేది కాదు.