పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జన్మవృత్తాంతాన్ని తెలియజేయడంలోను, జీవితంలోని ఇతరమైన అనేక చర్యల్లోను శ్రీకృష్ణుని రాజనీతి ప్రస్ఫుటంగా గోచరిస్తుంది.

శ్రీకృష్ణుడు : ఆపద్బాంధవుడు

కౌరవ సభలో ధర్మబద్ధులై భర్తలు తోడ్పడలేని నిస్సహాయ స్థితిలో ఉన్న సమయంలో, దుష్టదుశ్శాసనాదులు వివస్త్రను చేయటానికి పూనుకొన్నప్పుడు ద్రౌపది మొరపెట్టుకొంటే అక్షయ వస్త్ర ప్రదానం చేసి మానసంరక్షణం చేయటం, అరణ్యవాస సమయంలో పాండవులను శాపోవహతులను గావించటానికి దుర్యోధనుడు, శిష్యసహితుడైన దుర్వాసోమహర్షిని పంపించినపుడు ఆయనకు తగిన రీతిలో ఆతిథ్యమిచ్చి సత్కరించేటందుకు సూర్యుని చేత అక్షయపాత్ర ప్రదానం చేయించటం ఆయన ఆపద్బాంధవత్వానికి నిదర్శనాలు. అశ్వత్థామ క్రూరాస్త్ర ప్రయోగానికి గురియైన ఉత్తర గర్భాన్ని రక్షించి పరీక్షిత్ జన్మకు హేతుభూతుడై భరత వంశాన్ని నిలువబెట్టటం, ఆయన ఆర్తత్రాణ పరాయణత్వానికి ఉచితమైన ఉదాహరణ. ఆయన నిర్హేతుక జాయమాన కటాక్షానికి కుబ్జవృత్తాంతం చక్కని నిదర్శనం.

శ్రీకృష్ణుడు : భక్త జనాధీనుడు

“అనన్యా శ్చింతయంతో మాం యేజనాః పర్యుపాసతే | తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ ||”

ఇతర భావాలు లేనివారై ఎవరు నన్ను గురించి ఆలోచిస్తూ నిరంతరం ధ్యానిస్తుంటారో, వారి యోగక్షేమాలను నేను వహిస్తుంటాను అని తన భక్త పరాయణత్వాన్ని గురించి గీతలో భగవానుడు వెల్లడించాడు. రామావతారంలో మహర్షిసత్తములు "నీవు పరమాత్మ" వని ఎన్నిమార్లు చెప్పినా, నేను దశరథపుత్రుడను అని అన్నాడేగాని, తాను పరమాత్మనని అంగీకరింపలేదు. శ్రీకృష్ణుడు ఇందుకు భిన్నంగా తాను పరమాత్మనని మాహాత్మ్యాదులతో ప్రదర్శించుకొన్నాడు. ప్రత్యక్షంగా పలుమార్లు ప్రకటించుకొన్నాడు. యశోదకు నోటిలో బ్రహ్మాండాదులను చూపించటం, రాయబారవేళ తన్ను కట్టివేయదలచి నపుడు, మహాభారత యుద్ధారంభవేళ విశ్వరూప ప్రదర్శనం చేశాడు. తన యెడ భక్తితో వర్తించిన అక్రూర, ఉద్ధవ, విదుర, భీష్మ, కుంతి, ద్రౌపది రుక్మిణ్యాదుల యెడ భగవంతునివలె వర్తించాడు ఆయన.