"నహి రాజ్యే న మే కార్యం, నాప్యహం నృపకాంక్షితం!
న చాపి రాజ్యలుభేన మయా కంసో నిపాతితః ॥
"నాకు రాజ్యకాంక్ష ఎన్నడూ లేదు. రాజ్యలోభం వల్ల నేను కంసుని చంపలేదు” అని సెలవిచ్చి, మాతామహుడికి ప్రతినిధిగా రాజ్యపాలనం చేస్తూ లోకానికి ఉత్తమ పాలక లక్షణాలను ఆచరణ మూలంగా వెల్లడించాడు. పరస్పర వైషమ్యాలతో భిన్న మార్గులై వర్తిస్తున్న వృష్టి, సాత్వత్యాదులయిన యాదవ ప్రభువులను ఏకముఖం చేసి, ధర్మ సంస్థాపన మహాకార్యాలలో తన నాయకత్వము క్రింద అగ్రగాములై వర్తించేటట్లు వారిని తీర్చి దిద్దాడు.
శ్రీకృష్ణుడు : మహావీరుడు
శ్రీకృష్ణుడు వరగర్వితులైన శిశుపాల, కాలయవన, హంస - డిభక, పౌండ్రకవాసుదేవ, వజ్రనాభ, నరకాసురాది రాక్షసులతోను, జాంబవంతాది మహావీరులతోను నానావిధ యుద్ధనైపుణ్యాన్ని ప్రదర్శించి కొందరిని సంహరించి, కొందరిని సంస్కరించి జగదేక వీరుడని కీర్తికెక్కాడు.
రాజ, రాజరాజ నిర్మాత
దుష్టరాజన్యులను సంహరించినపుడెల్లా శ్రీకృష్ణుడు ఆ రాజ్యాల మీద గుణవంతులైన ధర్మప్రభువులను నిలిపి మహారాజనిర్మాత అనిపించుకొన్నాడు. ధర్మజునిచేత రాజసూయం చేయించి సమ్రాట్ నిర్మాత అయినాడు. ధర్మప్రియులైన పాండవుల పక్షాన్ని వహంచి భారత మహాసమరంలో వారికి విజయాన్ని చేకూర్చి, ధర్మ ప్రతిష్ఠాపనం చేశాడు.
శ్రీకృష్ణుడు : నిరుపమ రాజనీతి కోవిదుడు
కౌరవ, పాండవ రాజకీయ వ్యవహారాలతో సంజయ రాయబారం వరకు తనకేమీ పట్టనట్లు వర్తించిన శ్రీకృష్ణుడు, దుర్యోధన, ధృతరాష్ట్రుల దుష్టబుద్ధిని శంకించి స్వయంగా కౌరవ సభకు రాయబారిగా వెళ్ళే బాధ్యత తనమీద వేసికొని, సభలో బహుముఖీనమైన రాజనీతి నైపుణ్యాన్ని ప్రదర్శించి శత్రువుల బలాబలపరిజ్ఞానంతో తిరిగివచ్చి రాజనీతి కోవిదులలో అగ్రేసరుడనిపించు కొన్నాడు. రాజసూయవేళ తనను అర్చించడానికి అంగీకరించటంలోను, శశిరేఖా వివాహ సందర్భంలోను, కర్ణుడి