Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/293

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీకృష్ణ నాయకత్వాన సాగిన భారతయుద్ధభూమిలో పాల్గొన్న ఉభయ పక్షవీరులు ఏయే దేవాంశ రాక్షసాంశలతో జన్మించారో మహాభారత సభాపర్వ ఆరంభంలో విశదంగా నిరూపితమైనది.

కృష్ణుడు - విద్యాభ్యాసము

తాను సర్వజ్ఞుడైనా లోక శిక్షణకోసం “గురువులేని విద్య, కూసువిద్య" అన్న సామెతను నిరూపించేటట్లు, సుదామా (కుచేల) ది సతీర్థులతో మహర్షి సత్తముడైన సాందీపని దగ్గర అంతేవాసియై అష్టాదశ విద్యలను సకల కళాశాస్త్రాలను అనతికాలంలో అధ్యయనం చేశాడు. భావికాలంలో గీతోపదేశం చేయటానికి తగిన అర్హత నంతటినీ సమార్జించుకొని బ్రహ్మణ్యుడైనాడు. (తపస్సు, వేదము, సత్యము, జ్ఞానము, మొదలైన విద్యావివేకాల యెడ ప్రీతిగలవాడు 'బ్రహ్మణ్యుడు’). ఆయన బ్రహ్మణ్యుడని 'బ్రహ్మణ్యో దేవకీ పుత్ర' అని ఆత్మబోధోపనిషత్తు ప్రకటిస్తున్నది. తన శిష్యు డార్జించిన సామర్థ్యాన్ని పరీక్షించడం కోసం ప్రభాసతీర్థంలో మరణించిన తన పుత్రుని బ్రతికించమని సాందీపని కోరితే, శ్రీకృష్ణుడు యమలోకానికి వెళ్ళి మృతబాలుని బ్రతికించి తెచ్చి గురుదక్షిణగా సమర్పించి గురుఋణము తీర్చుకొన్నాడు. భార్య ప్రేరణంవల్ల దారిద్ర్య నివారణ కోసం సర్వసంపన్నుడైన తన కడకు వచ్చి చెప్పుకోలేక లజ్జాముద్రితుడైన సహపాఠి సుదాముణ్ణి, అతని మనోవృత్తి నెరిగి సర్వసంపన్నుని చేసి లోకాని కొక సత్పారాన్ని నేర్పాడు. తపః ప్రభావాన్ని నిరూపించటం కోసం తానే పుత్రార్థియై శివుని గురించి తపస్సు చేసి సిద్ధసంకల్పుడైనాడు. రాజసూయయాగ సందర్భంలో ధర్మజుడు వచ్చినవారిని పరామర్శిస్తుంటే శ్రీకృష్ణుడు ఆ యాగసందర్శానార్థం విచ్చేసిన మహర్షుల పాదప్రక్షాళం చేసి అర్చించి వినయ విధేయతా స్వరూపాన్ని లోకానికి ప్రదర్శించాడు.

ఆదర్శప్రభువు - జాతినిర్మాత

గోకులం నుంచి తన లౌకిక జీవిత ప్రయోజనాలను సాధించటం కోసం మథురానగరికి వెళ్ళి నాందీ ప్రస్తావనలుగా కువలయాపీడ మర్దనం, చాణూర, ముష్టిక సంహారం చేసి క్రూరనిరంకుశుడు, మాతులుడు అయిన కంసుని వధించి మాతామహుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. అశక్తత వల్ల వృద్ధుడైన ఉగ్రసేనుడు మథుర సింహాసనాన్ని స్వీకరించి రాజ్యపాలన చేయమని కోరినపుడు -