పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/292

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భూమి మీదికి తరలించి తాను క్రీడించాడని వ్యక్తమవుతున్నది. ఈ విశేషమంతా శ్రీకృష్ణావతారం పూర్ణావతార మనటానికి తగిన ఉపపత్తిని స్పష్టరూపంలో నిరూపిస్తున్నది.

అవతరణ రహస్యాలు

వేదార్థ విదులైన పెద్దలు కృష్ణావతార సమయంలోని అవతార రహస్యాలను ఎన్నింటినో వివరించారు. అందులో కొన్ని :

కృష్ణభగవానుడు పరమాత్మ. ఆయన బ్రహ్మానందంలో గాని ఆవిర్భవించ లేడు గనుక బ్రహ్మానందమే నందుడుగా అవతరించినది. పరమానందం ముక్తిలోనే లీనమై ఉంటుంది గనుక ముక్తికాంత యశోదగా రూపొందినది. దేవతలచేత కొనియాడబడుతున్న బ్రహ్మ విద్యే దేవకి గనుక శ్రీకృష్ణరూప పరబ్రహ్మం ఆమెయందు ఆవిర్భవించాడు. వేదార్థం నారాయణ స్వరూపం. అట్టివేదార్థమే శ్రీకృష్ణరూపంతో భూమిమీద అవతరించినది. గోపికలు శ్రీమహావిష్ణు ప్రతిపాదకమైన వేదమంత్రాలు కావటం తగిఉంది. జగద్గృహంలో శ్రీమహావిష్ణువు బ్రహ్మ రూప దండ సహాయంతో సర్వకార్యాలనూ నిర్వర్తిస్తుంటాడు కనుక, బ్రహ్మదేవుడు శ్రీకృష్ణ రూపగోపాలకుని వేణుదండం కావటం విశేషం. భగవంతుడైన రుద్రుడు సకల కళా ప్రవీణుడు. ఆయన శ్రీకృష్ణుని పిల్లనగ్రోవిగా అవతరించటం యుక్తము. ఇక్కడ ఉపనిషత్తులు గోపనీయాలు (కాపాడదగినవి) అలాగే స్త్రీలు గోపనీయలు గనుకనే ఉపనిషన్మంత్రాలు షోడశ సహస్రాధిక స్త్రీలు కావటంలోని ఔచిత్యం. శ్రీకృష్ణుణ్ణి యశోద కట్టివైచిన ఉలూఖలం (రోలు) దామము త్రాడు. దేవతా పితరులైన కశ్యపుడు అదితి కాకపోతే బంధితుడుగాని శ్రీకృష్ణుని బంధించటం ఎలా వీలు పడుతుంది? శ్రీకృష్ణ భగవానుడు అదితీకశ్యపుల చేత బంధితుడు కావటానికి, శిక్షణీయులైన యమళార్జునాదులను దండించటమనే ధర్మమార్గాన్ని కాపాడడం కోసం చేసిన అభినయం (నటన) మాత్రమే. కువలయా పీడము పూర్వజన్మలో అరిష్టుడనే రాక్షసుడు. దుర్యోధనుడు కలియుగావతారం. వైజయన్తి అనే కృష్ణుని పూలమాల, దాని పరిమళం కేవలధర్మం. వైజయంతి అనే పేరు జయహేతువు. “యతో ధర్మ స్తతో జయః" అను ప్రమాణాన్ననుసరించి ధర్మం, సైతం జయహేతువే గదా! అక్షరాల శిరోభాగంలో అనుస్వారం వలె ఉండే వైష్ణవమైన ఛత్రం ఆకాశం. శ్రీకృష్ణుని నందకం (గద) చతుర్దశ విద్యలు.