పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విశేషాలను వివరించి చెపుతున్నది. శ్రీరామచంద్రుని పురుష సమ్మోహనమైన దివ్యమంగళ విగ్రహాన్ని చూచి వనవాసులైన మహర్షులు సంతుష్టులై "స్వామీ! నిన్ను ఆలింగనం చేసికోవలెనని కోరిక మాకుదయించింది. అంగీకరించ”మని ప్రార్థిస్తే శ్రీరామచంద్రుడు "నేను మరొక పర్యాయం కృష్ణరూపంలో అవతరించబోతున్నాను. అపుడు మీరంతా గోపికలై అవతరించగలరనీ, అపుడు నన్ను ఆలింగనం చేసికోవచ్చును" అనీ ఈ ఉపనిషత్పీఠిక వెల్లడిస్తున్నది.

రుద్రాదిప్రధాన దేవతలు "మేము నీ ఆజ్ఞానుసారం భూలోకంలో అవతార సహాయకులుగా అవతరిస్తాము. కాని మమ్మల్ని సర్వదా నీ దేహసంస్పర్శనం కలిగే అవతారాలనే మాకు ప్రసాదించ' మని వేడుకొంటే స్వామి అంగీకరించాడు. అందు మూలంగా నందాదుల జన్మలేర్పడ్డాయి.

బ్రహ్మానందమే నందుడు. ముక్తి కాంత యశోద. బ్రహ్మ విద్య దేవకి. వసుదేవుడు ఉప నిషత్సముదాయం. వేదార్థం శ్రీకృష్ణ భగవానుడు. గోపికలు, గోపాలురు వేదమంత్రములు. విహార సమయాల్లో కృష్ణభగవానుని చేతిలో ఉండే వేణుదండం బ్రహ్మ. రుద్రుడు మురళి. శృంగము ఇంద్రుడు. స్నేహితులు దేవతలు. గోకులం (బృందావనం) వైకుంఠం. గోకులవనంలోని వృక్షాలు మునీశ్వరులు. ఆదిశేషుడు బలరాముడు. కృష్ణుని అష్టభార్యలు, షోడషసహస్రాదిక స్త్రీలు ఉపనిషన్మంత్రములు. రుక్మిణీ దేవి దయ. సత్యభామ అహింస, సుదాముడు (కుచేలుడు) శమము, అక్రూరుడు సత్యము, ఉద్ధవుడు దమము.

తృణావర్త, ధేనుకాది దైత్యులు లోభక్రోధాదులు. చాణూరుడు ద్వేషము. ముష్టికుడు మత్సరము. కువలయాపీడము దర్పము. బకాసురుడు గర్వము. అఘాసురుడు మహావ్యాధి. కంసుడు కలి. (కలహము)

శ్రీకృష్ణ భగవానుని నందకమనే ఖడ్గము మహేశ్వరుడైన రుద్రుని రూపము. శ్రీరుద్రునకు ఘోరాతనువు, శివాతనువు అనే రెండు రూపాలున్నవి. అందులో శివాతనురూపమైన శాంతి రూపం, వంశీనాదం. ఘోరాతనురూపం ఖడ్గం. శ్రీకృష్ణుని కట్టి వేసిన రోలు శ్రీమహావిష్ణువు తండ్రి యైన కశ్యపుడు. తాడు దేవమాతయైన అదితి. కృష్ణుని గద (కౌమోదకి) కాళిక, ధనుస్సు (శార్థము) వైష్ణవీమాయ. బాణము ప్రాణభక్షకమైన కాలం, వటవృక్షం గరుడుడు. వనమాల (తులసీమాల) భక్తి.

కృష్ణోపనిషత్తులోని పై వివరణ వల్ల, ఇతర విశేషాలవల్ల శ్రీమహావిష్ణువే కృష్ణభగవానుడుగా అవతరించటమే గాక, బృందావన రూపంతో సమస్త వైకుంఠాన్నీ