పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దివ్యబాలుడుగా అవతరించి చిత్రహింసలకు గురి అవుతున్న తల్లిదండ్రుల హృదయాలలో ఆశాజ్యోతులను వెలిగించి, భావిజన నాయకుడుగ పరిణమించి, ప్రఖ్యాతి నార్జించటం కోసం తండ్రి వసుదేవునిచేత తనను గోకులంలోని నందగోపుని ఇంటికి చేర్పించుకున్నాడు. తనకు ప్రతిగ నిల్పిన మహామాయచేత తానవతరించి అతణ్ణి హతమార్చనున్నాడని హెచ్చరిక చేయించి, కంసుని హృదయంలో భయాగ్నిజ్వాలలను ప్రజ్వలింప జేశాడు.

నందుని ఇంట ముద్దుబిడ్డడై పెరుగుతూ అతిచిన్న వయస్సులోనే కామరూపిణియైన పూతనను సంహరించటం, అఘాసుర, శకటాసుర, ధేనుకాసుర, తృణావర్త, వృషభాసురాది దుష్టులను పరిమార్చి తన మాహాత్మ్యాన్ని, దివ్యత్వాన్ని ప్రదర్శించాడు. మృద్భక్షణం చేసి తల్లి యశోదకు తన దివ్యత్వాన్ని ప్రదర్శించి వాత్సల్య రసానుభవం కోసం మరుక్షణంలోనే మరిచిపోయేటట్లు చేశాడు. క్షీర, నవనీతాదులను దొంగిలించి ఒకవంక గోపాలకులకు కష్ట నష్టాలను కల్పించి కోపోద్రేకాలపాలు చేస్తున్నా, వారికి వీడరాని ప్రియ బాలుడైనాడు. ఆప్తమిత్రుడు, అగ్రగామి యై వారికి నాయకుడై యుగయుగాలుగా వస్తున్న ఇంద్రపూజకు స్వస్తి చెప్పించి గోవర్ధన పూజ నారంభించి, ప్రతీకారంగా ఇంద్రుడు కురిపించిన శిలా వర్షం నుంచి వారి కభయమిచ్చి కాపాడి, తాను సాధుజన రక్షకుడైన దేవదేవుడన్న విశ్వాసం కల్గించాడు.

శ్రీకృష్ణుడు గోకులాన్ని ఆవరించి ఉన్న కాళీయాది అసురశక్తుల నన్నింటినీ నిర్మూలించి వారి హృదయాలలో ధార్మికమైన సజ్జన భావనను కల్పించాడు. గోపాలకుల క్షీర, నవనీతాలను దొంగిలించటం మూలంగా వారిని ప్రేమించి సుజ్ఞానులను, విజ్ఞానులను చేశాడు. గోపీ కృష్ణ ప్రణయమార్గం ద్వారా గోపకులానికి జీవాత్మ పరమాత్మలకు గల సంబంధాన్ని వెల్లడి చేశాడు. రాధా ప్రణయలీలల మూలంగా భక్తి అవిచ్ఛిన్న తైలధార వంటిదని నిరూపించాడు. రాసక్రీడలవల్ల గోపకులానికి 'సో హం' మార్గాన్ని నిరూపించాడు. ఈ విధంగా గోకుల జీవితంలో శ్రీకృష్ణుడు అశక్తులు, నిస్సహాయులు, అజ్ఞానులు, అసంస్కృతులు అయిన సామాన్యజనానికి దైవమైన తానే వెనుక శక్తియై, సహాయకుడై, బోద్ధయై, సంస్కర్తయై వర్తిస్తానని ప్రకటించాడు.

అవతార సహాయకులు

అథర్వ వేదాంతర్గతమైన 'కృష్ణోపనిషత్తు' శ్రీమహావిష్ణువు కృష్ణావతారాన్ని ఎత్తటానికి పూర్వమే రుద్రాది దేవతలు అవతార సహాయకులుగ అవతరించిన