అకారో విష్ణువచన శ్శ్వేతదీపనివాసినః నరనారాయణార్ధస్య విసర్గో వాచక స్మృతః ||" క్+ఋ+ష్+ణ్+అః= కృష్ణః కకారము బ్రహ్మ వాచకము. ఋకారము అనంతవాచకము. 'ష'కారము శివ వాచకము ణ కారము బ్రహ్మవాచకము. ఆ కారము విష్ణువాచకము. విసర్గ నరనారాయణులను తెలుపుతుంది. అంతేకాక కృష్ణః నల్లనివాడు. సర్వం కరో తీతి కృష్ణః - సర్వమును చేయువాడు. కర్ష తీతి కృష్ణః రాక్షసులను సంహరించువాడు అని కూడ కృష్ణశబ్ద వ్యుత్పత్తి విశేషాలు కన్పిస్తున్నవి.
కృష్ణావతార ఆవశ్యకత - వైశిష్ట్యం
ప్రతిసృష్టిలోను జీవులు దేవాంశ, రాక్షసాంశలతో పూర్వ జన్మల్లో సంపాదించిన పాప పుణ్య కర్మల సంచితాల కనుగుణంగా సజ్జనత్వ, దుర్జనత్వాలతో జన్మిస్తారు. యుగాంత సమయాలల్లో దుష్టశక్తులు ప్రబలి విశృంఖల విహారం చేస్తూ ఆపదలు కల్గిస్తున్నప్పుడు భగవంతుడు అవతరిస్తాడు. దేవాంశలతో భీష్మ, ద్రోణ, ధర్మజాదులు జన్మించి, రాక్షసాంశ సంభూతులు, దుష్టులైన దుర్యోధనాదుల విజృంభణం వల్ల ధర్మజాదులు ఆపదలపాలై అధర్మానికి తాత్కాలిక విజయం చేకూరటం జరుగుతున్న సమయంలో, అధర్మాన్ని నిర్మూలించి ధర్మాన్ని స్థాపించటం కోసం కృష్ణపరమాత్మ అవతరించటం అవసరమయింది. ఆయన ద్వాపరయుగాంత సమయంలో ఒక శ్రావణ బహుళ అష్టమి (జన్మాష్టమి) నాడు చీకటి చిందులాడే చెరసాలలో దేవకీదేవి అష్టమగర్భాన లీలామానుషవిగ్రహుడై అవతరించాడు. వీర, శృంగారాది నవరసపరిపూర్ణుడై మహాయుద్ధవీరుడుగా, ఆదర్శ ప్రభువుగా, రాజనీతి ధురంధరుడుగా, అనుష్ఠిత సదాచార ప్రవర్తకుడుగా, ధర్మసంస్థాపనాచార్యుడుగా, సర్వోపదేష్టయైన జగదేక గురువుగా, భక్తలోకశరణ్యుడుగా వ్యవహరించి, తన కర్తవ్య నిర్వహణానంతరం నిర్యాణాన్ని పొందటమే శ్రీకృష్ణావతార వైశిష్ట్యం.
పుట్టుక - బాల్య క్రీడలు
శ్రీకృష్ణుడు లీలామానుష విగ్రహుడు. కారాగారంలో బంధితులైన దేవకీ వసుదేవుల గర్భాన, తనకు పూర్వం అగ్రజులు ఏడుగురు క్రూరనిరంకుశుడైన మేనమామ కంసుని కఱకు కత్తికి బలియైనారని ఎఱిగి ఎఱిగి, ఎనిమిదవ వాడుగా భూమిపై పడటమే ఆయన తొలి లీల. మానవాకృతితో తరువాత ఆయన నిర్వహించిన సమస్తచర్యలూ ఆయన లీలావిశేషాలే.