చెయ్యటమే ఆచారమైనది. ఈ పొలిమేర దాటటానికి ముందు ఖంజరీట దర్శనం చేయాలి. ఈ కాటుక పిట్ట, వర్షర్తువు వెళ్ళిన తరువాత ఆకాశం మేఘ రహితమయితేనే కాని బయటికి రాదు. దీని రాక యాత్రానుకూల్యాన్ని సూచిస్తుంది. కనుకనే యాత్రకు ప్రతీక అయిన సీమోల్లంఘన సమయంలో ఖంజరీట దర్శనం చేయవలసి వచ్చింది. ప్రాచీన కాలవిజ్ఞానానికి సూచకమయిన ఈ చర్య ఇంకా కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్నది.
పూర్వ రాజన్యులు అశ్వారూఢులై పరివార సైన్య సమేతంగా పొలిమేర దాటి, ధనుష్టంకారం చేసి, అక్కడ ధర్మవిద్రోహులు, లోక కంటకులు అయిన శత్రువులకు ప్రతిగా నిల్పిన బొమ్మల మీద బాణ ప్రయోగం చేసి వధను అభినయించేవారు. వీరి జైత్రయాత్రకు పరద్రవ్యాపహరణాసక్తిగాని, రాజ్యవిస్తరణ కాంక్ష గాని కారణాలు కావు. తిరిగి వచ్చేటప్పుడు వీరు శమీ వృక్షం మీదుగా వచ్చి, చిన్న కొమ్మను త్రుంచి శిరసు మీద ధరించి తెస్తూ తరువాత నగర ప్రవేశం చేసేవాళ్ళు. ఆలయాల్లోని దేవతామూర్తులు సైతం ఈ విజయదశమి నాడు భూత ప్రేత పిశాచాదులను అదుపులో పెట్టడం కోసం చేసే జైత్రయాత్రకు సూచకంగా సపరివారంగా సర్వసన్నాహాలతో, సీమోల్లంఘనాదులు చేయడం ఆచారంగా వస్తున్నది. ధర్మ విజయాభిలాషతో, ధర్మ ప్రచార దృష్టితోను చేసే యాత్రకు సూచకంగా యీ నాడు పీఠాధిపతులైన యతీశ్వరులు, ఇతరులు సీమోల్లంఘనం చేస్తారు. నానావిధ విద్రోహలను వెంటపడి పట్టుకోవడానికి సూచకంగా 'పారువేట' జరిగేది. ఈ పారువేట తంతులో బాగా బలిసిన గొర్రెకు తోక కోసి, క్రొత్త సున్నం పెట్టి, కోలాహలం చేస్తూ తరిమితే అది చిక్కకుండా పారిపోతు న్నప్పుడు పిక్కబలం కలవాళ్ళు వెంట పరుగెత్తి దానిని గెలుచుకుని పురస్కారాలను, పారితోషికాలను పొందటమనే విశేషాన్ని జరిగిస్తారు. ఇవి సామాన్య జనవిలాసమై, శరీరపుష్టిని, ధావన కౌశలాన్ని పెంపొందిస్తవి.
సీమోల్లంఘనం సర్వసిద్ధి ప్రదం కాబట్టి శతవృద్ధులు తప్ప తక్కినవారు అందరూ ఈ విజయదశమీ కర్తవ్యాన్ని నిర్వహిస్తారు. వీరు కూడా సాంకేతికంగా పొలిమేర దాటిన చోట శత్రువిజయాన్ని అభినయిస్తారు. జయశీలంతో శమీ వృక్షం మీదుగా తిరిగి వస్తూ 'జమ్మికొట్టి' పత్రితో ఇంటికి వచ్చి, పెద్దల చేతిలో పెట్టి 'శమీ శమయతే పాపం శమీ శత్రువినాశినీ' ఇత్యాదిగా గల శ్లోకాన్ని పఠిస్తూ నమస్కారం చేసి, ఆశీర్వచనాలు పొందుతారు.
నవరాత్రి విజయదశమ్యుత్సవాలు ఈ విధంగా హిందూ జీవన విధాన నాగరికతా సంస్కృతులను ప్రదర్శించుకోటానికి, పరస్పరావగాహనలకు పట్టని అద్దాలై, శీల