సమీకృతమైన దేశభక్తి అర్థమైనది. వారికి మనం శక్తిమంతులము, అజేయులం అన్న భావాలు హత్తుకుని మనోధైర్యాన్ని, హృదయశాంతిని లభింపజేశాయి.
విజయదశమి - అపరాజితా పూజనము
విజయదశమి నాటి కర్తవ్యాలు అపరాజితాపూజనము, శమీ పూజ, సీమోల్లంఘనములు. అపరాజిత (పరాజయము లేనిది) ఋగ్వేదార్య దేవత. కౌటిల్యుడు ఈమెకు అప్రతిహత (అడ్డు లేనిది) జయంత (విజయశీలము గలది) వైజయంత (జయము నిచ్చునది) అనే మువ్వురు క్షాత్రదేవతలను తోడుచేసి, జైత్రయాత్ర సందర్భాల్లో వీరిని పూజించి తీరాలని నియమ మేర్పరిచాడు. బహుకాలం నుంచి రాజులు ‘విజయ’ నామంగల దశమి నాడే రుద్రప్రియ అయిన అపరాజితను పూజించటం ఆచారంగా వచ్చింది. పూజ ముగిసిన తరువాత పసుపుగుడ్డలో గరిక, ఆవాలు పెట్టి వలయంగా చేసి 'అపరాజితా! నీవు లతలలో ఉత్తమమయిన దానివి. సకలార్థ సిద్ధి కోసం నిన్ను ధరిస్తున్నా' నని చెప్పి దానిని కుడిచేతి దండకు కట్టుకోవడం ఆచారం. అపరాజిత కాళిదాసు కాలంలో ఒక మూలికగాను, తరువాతి కాలంలో విష్ణు క్రాంత, చంద్రక్రాంతగానూ మారి, చివరకు మరుగుపడింది. చివరికీ శబ్దం అగ్నిని పుట్టించే అరణికి మూలము అయిన శమీ వృక్షాన్ని వ్యక్తం చేయటం జరిగింది. అగ్ని వీరానికి, వైరానికి ప్రతీక. ఆ అగ్నిని గర్భ మందు ధరించుట వల్ల పూజార్హతను పొందిన శమీ వృక్షాన్ని పూజించే సమయంలోనే తరువాతి కాలంలో రాజులు శమీపూజ చేశారు.
శమీపూజ - ఖంజరీటదర్శనము, సీమోల్లంఘనము
ఈ శమీపూజా సందర్భంలో శివ ప్రీతికరమైన ఈశాన్య దిక్కుకు వెళ్ళి అక్కడ ఉండే జమ్మిచెట్టుకు గొప్పు త్రవ్వి, నీరు పోసి, క్రింద స్థలశుద్ధి చేసి, అష్టదళ పద్మాన్ని నిర్మించి, దానిమీదికి దుర్గాదేవి మూర్త్యంతరమైన అపరాజితను, ఆమెకు అంగదేవత లయిన జయ విజయలను ఆహ్వానించి, అపరాజితకు, శమీదేవికి భేదం లేనట్లు పూజిస్తారు. పూజ వేళ 'శ్రీరామ పూజితా! శమీ! నా జైత్రయాత్రను నిర్విఘ్నంగా కొనసాగించు’ ఆమెను 'నీవు అర్జునుని బాణాలను ధరించిన దానవు; రామచంద్రునితో ప్రియమైన మాటలు పలికిన దానవు' అని స్తుతిస్తారు.
శత్రు విజయం కోసం, కార్యార్ధ సిద్ధికోసం, దేశాంతర యాత్ర కోసం విజయదశమి నాడు సీమోల్లంఘనం చేయవలెనని శాస్త్రం చెప్పింది. సీమోల్లంఘనం శమీపూజకు పూర్వం గాని, తరువాత గాని ఎప్పుడైనా చేయవచ్చునని ఉన్నా తరువాత