పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాళికా వేషధారులు చిత్రవిచిత్రంగా కత్తికటారులను త్రిప్పుతూ తమ శస్త్రవిద్యా నైపుణ్యాన్ని ప్రదర్శించి పాలకుల వల్ల పారితోషికాన్ని పొందుతారు.

గ్రహానుకూల్యం ఉన్నా లేకపోయినా పరదేశాలకు వెళ్లదలచుకున్న వాళ్ళు బయలుదేరటం మరొక ఆచారం. రాజస్థాన్ లోని కొన్ని ప్రాంతాల్లో దేవీ నవరాత్రుల లోను విజయదశమి నాడు, దేవీ విగ్రహాన్ని కాకుండా ఖడ్గాన్ని పూజిస్తారు. తామసిక పూజ చేసేవాళ్ళు విపరీతంగా మద్యపానం, జంతుబలి చేస్తారు. వంగదేశంలో ఈ నాటి సంబరాలు అతిభీకర రూపంలో సాగేవి.

విజయదశమి - బలనీరాజనోత్సవము

విజయదశమి ప్రధానంగా క్షత్రియుల పండుగ. అందువల్ల మహారాజులు, రారాజులు గజతురగ భటాది సైన్య బలాలన్నిటినీ ఈ విజయదశమి నాడు పర్యవేక్షించి, ప్రశంసించి, నీరాజన మిస్తారు. రావణ వధానంతరం దేవి ఈ దశమినాడే స్వర్గానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు దేవసేనకు నీరాజనమిచ్చాడట. అందువల్ల జైత్రయాత్రా సందర్భాల్లో బలనీరాజనోత్సవం చేయటం క్షత్రియులకు ఆచారమైంది. విజయదశమి నాడు జైత్రయాత్రా సూచకంగా సీమోల్లంఘనం చేయటం జరుగుతుంది. కనుక రాజులు ముందుగా బలనీరాజనోత్సవం జరిపించేవారు. కృష్ణ దేవరాయాది విజయనగర సార్వభౌములు ఈ ఉత్సవాన్ని ఘనవైభవంగా చేసినట్లు నిదర్శనాలు కనిపిస్తున్నవి. చక్రవర్తి మూలబలాన్ని ముఖ్యనగరంలో జరుగుతున్న నవరాత్ర్యుత్సవాలలో పాల్గొనటానికి వస్తూ సామంతులు వెంట తెచ్చిన సైన్యాలను బారులు తీర్చి మహానవమి వేదిక ముందు నిలిపితే ప్రతిశ్రేణి ప్రధాన గజాన్నీ, ప్రథనాశ్వాన్ని, ప్రధాన భటుని ఆ శ్రేణుల అధిపతులను చందనాదులతో అలంకరించి, మాలలు వేసి చక్రవర్తి స్వయంగా నీరాజన మిచ్చేవాడట. ఆ శ్రేణులలోని ఇతర గజాశ్వాదులను చక్రవర్తి సన్నిహిత బంధువులు, ముఖ్యోద్యోగులు ఇలాగే పూజించి నీరాజన మిచ్చేవాళ్ళు. ఈ నీరాజనోత్సవంలో దేశం నలుమూలల నుంచి రప్పించబడ్డ నాట్యకత్తెలు సైతం పాల్గొనేవారు. ఇట్టి విచిత్ర దృశ్యాలతో కూడిన విజయదశమి నాటి విజయనగరాన్ని విభ్రాంతితో తిలకించిన పియజ్ అనే విదేశీయాత్రికుడు 'ఇది స్వప్నమా! మిథ్యాకల్పనమా! మృణ్మయమైన భూమి మీద ఇటువంటి సౌందర్యం ఎక్కడ ఉంటుం!' దని మెచ్చుకున్నాడు. ఈ బలనీరాజనోత్సవం రాజభక్తిని, దేశభక్తిని, ధర్మ రక్షాసక్తిని సైన్యంలో పెంపొందించింది. దీన్ని కన్నుల పండువగా చూచిన ప్రజకు