పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బయలుదేరడానికి ఉద్దేశించాడు. మరుక్షణంలోనే కుబేరుడు రఘుమహారాజు కోశాగారంలో కనక వృష్టి కురిపిస్తే కౌత్సుడు అందులో తనకు కావలసినంత ద్రవ్యాన్ని తీసుకొని, మిగిలినది ఈ రఘుమహారాజ ధార్మిక విజయ విలాసంగా నవరాత్రులు గడిచిన మరునాడు ప్రజలకు పంచి యివ్వటం వల్ల, శ్రవణ నక్షత్రయుక్త దశమి విజయదశమి అయినదనీ అనేక రీతులుగా విజయదశమి నామానికి కారణాలను చెప్పుకోవటం జరుగుతున్నది. ఇలా అనేక మహత్తర విజయాలకు స్మృతి చిహ్నమైన విజయదశమి చేరటం వల్ల 'నవరాత్రము' దసరా (దశరా) అయినది.

విజయదశమి - ఉత్సర్జనోత్సవము

నవమినాటి రావణవధానంతరం దేవిని మహోత్సవాలతో స్వర్గానికి పంపించారు కనుక నేడు కూడా నవరాత్రులలో పూజించిన దేవికి విజయ దశమినాడు వీడ్కోలివ్వటం (ఉత్సర్జనోత్సవం) జరుగుతున్నది. ఈ ఉత్సర్జనోత్సవాన్ని శాబరోత్సవంగా జరిపించాలని, అలా చేయటం దేవికి ఎక్కువ ప్రియమనీ కొన్ని ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతున్నవి. శబరుల వలె ఆకులలములు కట్టుకుని, భేరి పటహాది వాద్యాలను మ్రోగించుకుంటూ, శంఖాలు కొమ్ములు ఊదుతూ, ఆశ్లీలాలు పలుకుతూ, అసభ్య గానాలు చేస్తూ ఒకరి మీద ఒకరు బురద, బూడిదలు చల్లుకుంటూ దేవిని పంపించటం శాబరోత్సవానికి ముఖ్య లక్షణాలు. బురద చిమ్ముకోవటం, బూతులు మాట్లాడడం లేకపోతే దేవి తృప్తిపడదట. అణచిపెట్టిన క్షుద్ర లైంగికాభిలాషను (లోయర్ సెక్స్ డిజైర్స్) ఈ రూపంగా బయట పెట్టి, తృప్తిని పొంది, చేతనకు కలిగే నైజావరోధాలను తొలగించుకునేందుకు ఈ శాబరోత్సవమూలంగా మన పూర్వులు చక్కని అవకాశాన్ని కల్పించినట్లు కనిపిస్తుంది.

విజయదశమి - ఆచారాలు

విజయదశమినాడు సీతారాములను పూజించాలి అని నారద పురాణం చెబుతున్నది. దేవి పూజలు లేని ఉత్తర దేశంలోని కొన్ని ప్రాంతాలలో దీనిననుసరించి 'రామలీల' వంటి ఉత్సవాలను జరిపించడం ఆచారమైనట్లు కనిపిస్తుంది. గొప్ప ఊరేగింపులో రావణ కుంభకర్ణుల పెద్ద బుట్టబొమ్మలను విశాలమైన మైదానానికి తీసుకువెళ్ళి తగులబెట్టి ధర్మ ద్రోహులను, సాధుజన శత్రువులను హతమార్చినట్లు ఆ ప్రాంత ప్రజలు ఆనందిస్తారు. ఊరేగింపులో ఏనుగుల మీద సీతారామ లక్ష్మణుల వేషాలు ముందు నడుస్తుంటవి. ఈ ఉత్సవం వీరగుణ సూచకం కనుక, రామలీలల్లో