పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వల్ల నవరాత్రులలో దేశం కళకళ లాడుతుంటుంది. దేవాలయాల్లో నానావిధ చిత్రవర్ణాలతో, మృణ్మయాదులతో దేవీరూపాలను దినానికొకరీతిగా కల్పన చేస్తుండటం వల్లనూ, హరికథా శ్రవణాదుల వల్లనూ అవి విజ్ఞాన నిలయాల వలెనూ, ప్రయోజనాత్మకమైన విలాస రంగాల వలెనూ విలసిల్లుతుంటవి. సామాన్య జనులు కొందరు మహిషాసుర మర్దని మొదలైన దేవీ రూపాలను ఆ తల్లి వాహనాలైన సింహ శార్దూల రూపాలను, రాక్షసరూపాల, వేషాలు ధరించి పగటి వేళ ఊరేగింపులు చేసుకుంటూ దేవీ కథలను ప్రదర్శించి, సాధారణ జనులు విజ్ఞాన విలాసాలకు తోడ్పడుతుంటారు. తమిళ కన్నడ దేశాలలో దేవీ వేషాలను మధ్య నిలుపుకొని, తారు పూసుకున్న రాక్షస విచిత్ర వేషధారులు పగటివేళ వీథుల విజ్ఞాన విలాసాలకు తోడ్పడు తుంటారు. భారతదేశమంతటా విస్తరించి ఉన్న ప్రధాన శక్తి పీఠాలు గల నగరాల్లో ఈ నవరాత్ర్యుత్సవాలను ప్రజలు వైభవోపేతంగా జరుపుకుంటూండటం కనిపిస్తుంది.

విజయదశమి - నామ హేతువులు

విజయదశమి దేవీ నవరాత్రులకు కిరీటం వంటిది. ఈ పండుగకీ పేరు రావటానికి పురాణాలు, వ్రత గ్రంథాలు, జనశ్రుతి (ట్రెడిషన్) అనేక కారణాలను చెపుతున్నవి. రావణ వధ నవమినాడు జరిగింది కనుక కృతజ్ఞతా ప్రకటన కోసం దేవతలు దేవీ విజయోత్సవాలు దశమి నాడు చేశారనీ, తత్సూచకంగా దేవీ నవరాత్రుల నెంటనే వచ్చే శ్రవణంతో కూడిన దశమి విజయదశమి అయిందని ఒక అభిప్రాయం. పాండవ యోధుడైన అర్జునుడు ఉత్తర గోగ్రహణ యుద్ధంలో భీష్మద్రోణాది వీరుల మీదికి వెళ్ళి ఈ దశమి నాడు విజయం పొందడం, విజయదశమి. దేవి మహిషాసురుణ్ణి వధించినపుడు ఈ దశమి నాడు దేవతలు విజయోత్సవం జరపటం వల్ల విజయదశమి అనీ, దశమినాడు జైత్రయాత్రకు బయలుదేరిన రాజులకు విజయం తథ్యం కనుక విజయదశమి. అశ్వయుజ శుద్ధ దశమి నాటి శ్రవణా నక్షత్రోదయ సమయానికీ 'విజయ' అన్న జ్యోతిషశాస్త్ర సాంకేతిక వ్యవహారం ఉండడం వల్ల అటువంటి 'విజయ'తో గూడిన దశమి విజయదశమి. నవమాస గర్భధారణకు సంకేతకంగా నవరాత్రులు చేసి దేవి నూతన సృష్టిని కల్పించడంలో దశమి నాడు విజయాన్ని పొందింది కనుక విజయదశమి. విశ్వజిద్యాగం చేసి మృణ్మయ పాత్రతో మిగిలిన రఘువు దగ్గరకు వరతంతు మహాముని శిష్యుడయిన కౌత్సుడు గురుదక్షిణ కోసం (పదునాలుగు కోట్ల బంగారు నాణెములు) యాచించటానికి వచ్చి, ఆ మహారాజు రిక్తహస్తుడని గుర్తించి వెళ్ళబోతున్నప్పుడు, ఆయన అతణ్ణి ఆపి స్వర్గం మీదికి యుద్ధయాత్రకు