పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రచారకమైన బొమ్మల కొలువును నిర్వహిస్తున్నారు. వీరి 'బొమ్మల కొలువు' బహుళార్థ సాధకమైన క్రియాకలాపం. ఇది ప్రధానంగా విజ్ఞానవంతులు గాని సామాన్య ప్రజలకూ, భావికాల సంస్కృతీపరిరక్షకులైన బాలలకు భారతీయుల సగుణ నిర్గుణ విభేదాలతో అనంతంగా విలసిల్లే దేవతా స్వరూపంతో ప్రథమ పరిచయం కలిగించడానికి ఉద్దేశింపబడింది. వేదాలకు పురాణాలు వాఖ్యానాలైనట్లు దేవతా స్వరూపానికి ఈ బొమ్మల కొలువులు వ్యాఖ్యలు. బ్రహ్మ శబ్దానికి వికృతి రూపమే బొమ్మ. ఈ బొమ్మల కొలువుల్లో విజ్ఞానవతులైన స్త్రీలు సృష్టి, స్థితి, లయకారకులైన త్రిమూర్తులను, వారి శక్తులను, వారి అంగదేవతలను నవ రసోచితంగానూ, స్థానోచితంగాను నిలుపుతారు. ప్రశ్నించినవారికి వయోవిజ్ఞాన విభేదాలను అనుసరించి వివరిస్తారు. ఈ కొలువులోను, వీటికి అనుబంధంగా సాగించే పేరంటాలలోనూ స్త్రీలు తొమ్మిదినాళ్ళూ సర్వస్వతంత్రలై శక్తి స్వరూపిణులుగా వ్యవహరిస్తూ తమ విద్యా సంస్కృతులను, సంగీత చిత్ర లేఖనాదులందలి కళాకౌశలాలను, అలంకరణలోని నర్మమర్మాలను, లోకజ్ఞతా క్రియాదక్షతలను ప్రదర్శిస్తుంటారు. ఇందుమూలంగా స్త్రీలలో పరస్పరానుబంధాలు, స్నేహ సౌహార్దాదులు వృద్ధి పొంది సంఘ పురోభివృద్ధికి దారి తీస్తవి.

నవరాత్రులు - బాలలు

శ్రీరామ విజయానికి చేదోడు వాదోడైన ఆంజనేయాది వానర వీరులకు ప్రతీకలైన కోతులను ఆడించుకుంటూ, విల్లంబులు చేపట్టి 'విజయీభవ దిగ్విజయీభవ' చెప్పుకుంటూ, 'అయ్యవారికి చాలు ఐదు వరహాలు, పిల్లవాండ్రకు చాలు పప్పుబెల్లాలు' మొదలైన దసరా పద్యాలు చదువుకుంటూ భారతీయ విద్యా సంస్కృతులను పరిరక్షించడానికి ఏర్పడ్డ మహాసైన్యంలోని బాలశాఖో అన్నట్లు ఈ నవరాత్రులలో బాలలు వీథివీథీ ఊరేగుతారు. తమ గురువులను సగౌరవంగా ఇండ్లకు తీసుకుపోయి ఏడాది పొడుగునా సాధించిన విద్యావిశేషాలను స్థూలారుంధతీ న్యాయాన తల్లిదండ్రుల ముందు ప్రదర్శించి, అయ్యవారికి వార్షికమైన కట్నాన్ని ఇప్పించి, చందన తాంబూల నూతన వస్త్రదానాది సత్కారాలు చేయించి సంతసిస్తారు. విజయదశమి నాటి సీమోల్లంఘనము, జమ్మికొట్టం మొదలైన కలాపాల్లో వీరి వర్తన చూస్తుంటే భారతజాతి సంస్కృతీ వీరతలు వీళ్ళ చేతుల్లో భద్రంగా ఉంటవనే విశ్వాసాన్ని పెద్దలకు కలిగిస్తూంటారు.

విద్వదోష్ఠులలోను, సంగీతాది సభలలోను పాల్గొంటూ విద్వాంసులు, కళాకారులు వార్షికాలను, పారితోషికాలను అందుకుంటూ సంచారం చేస్తుండడం