పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్టమి దుర్గా పూజకు, నవమి లక్ష్మీపూజకు ప్రధానంగా ఉద్దేశింప బడతవి.

మహా నవమినాడు ధనధాన్యాది వస్తురూపంలోనూ, కంచరం, కమ్మరం, కుమ్మరం, వ్యవసాయం మొదలైన వృత్తుల సాధనాల రూపంలోను మహాలక్ష్మి పూజ ఎట్టి విభేదాలు లేకుండా చేస్తారు. ఆ నాడు నానాజనం శక్తి కొద్దీ జాతరలు చేసుకుంటారు. ఆ నాడు మొదలు ఈ నాటి వరకూ చక్రవర్తులు, రాజులు, జమీందారులు మహానవమి నాడు లోహాభిసారిక అనే తంతు నడిపించేవాళ్ళు. పూర్వం లోహుడనే రాక్షసుడు లోకభీకరుడై దేవతల మీదకి దండెత్తి వస్తే దేవి సహాయంతో వాణ్ణి ముక్కలు ముక్కలుగా త్రుంచి వేశారట. ఆ లోహపు ముక్కలే నేటికీ ఆయుధాలకు ఉపకరిస్తున్నాయి. శస్త్రోపజీవులైన క్షత్రియులు నవమి నాడు పై వృత్తాంతానికి స్మృతిగా లోహాభిస్మారమనే చిత్ర క్రియను చేసి ఛత్ర, చామర, సింహాసన, కనకదండాది రాజలాంఛనాలనూ, చాపఖడ్గాది ఆయుధాలను పూజిస్తారు. దీనికే 'ఆయుధ పూజ' అని నామాంతరము.

నవరాత్రులు - లౌకిక ప్రాముఖ్యము

ప్రాచీన కాలంలో చక్రవర్తులు జరిపించే ముఖ్యనగరంలోని నవరాత్ర్యుత్సవాలకు దేశంలోని సామంతులు నలమూలల నుంచీ వస్తూ తమ ప్రాంతంలోని వేదశాస్త్ర విద్వాంసులను, సంగీత నాట్యాది కళావేత్తలను, మల్లురు మున్నగు బలవిద్యాప్రవీణులను ఇతర చిత్ర విద్యానిపుణులను వెంటబెట్టుకో వచ్చి సమ్రాట్టుకు సమర్పించేవారు. ఆయన నవరాత్రులలో ప్రతినిత్యం వారిని పరీక్షించి, సముచిత బహుమానాలిచ్చి సత్కరించేవాడు. వారి సంచారం విద్యాభివృద్ధికీ, కళాకౌశలాన్ని విస్తరింపజేయడానికి తోడ్పడుతుండేది. చక్రవర్తుల మార్గాన్నే సామంతులు, ధనికులు ప్రముఖోద్యోగులు అనుసరించేవాళ్ళు. ఇందువల్ల పాలకులైన వారికి వివిధ విద్యారంగాలను సమీక్షించి, దోహదమిచ్చి ప్రయోజనాత్మకంగా దేశశక్తులను ఏకోన్ముఖం చేయడానికి అవకాశం లభించేది. విద్వాంసులలో, ప్రజలలో అన్యోనమైత్రి, అవగాహన, పరస్పర సహన సహకారాలు, అభివృద్ధి పొంది, సమష్టి జీవనవిధానం వృద్ధి పొంది, ప్రగతిని సాధించడానికి వీలయ్యేది. ఇట్టి ప్రయోజనాలు నవరాత్రుల వల్ల ఆ నాడే కాక యీ నాడూ లభిస్తున్నవనటం నిస్సంశయం.

నవరాత్రులు - స్త్రీలు - బొమ్మల కొలువులు

దేవీ నవరాత్రులలో స్త్రీలు విశేషంగా ప్రముఖ పాత్ర వహిస్తూ వస్తున్నారు. ఒక వంక వీరు భర్తలతో పాటు కల్పోక్త పూజలలో పాల్గొంటూ, మరొకవంక జ్ఞాన విజ్ఞాన