పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దాక్షిణాత్యులు సాత్విక విధానాన్నే విశేషంగా ఆదరిస్తారు. ఉత్తర దేశంలో ముఖ్యంగా వంగదేశంలో దేవీపూజ అజమహిషాది బలులతో (మేకలు, దున్నపోతులు మున్నగునవి), సురాపానము, అశ్లీల సంభాషణము మొదలయిన కార్యకలాపాలతో ఉన్మత్తము, భీకరమై, రాజస తామస విధానాలను అనుసరించి జరుగుతుండేది.

ప్రతిపదాది కల్పోక్త పూజాపద్దతి

ప్రతిపదాది కల్పాన్ని అనుసరించి దేవీ పూజలు జరిపేవాళ్ళు, పాడ్యమి నాడు దీక్ష వహించి కలశస్థాపన చేసి దేవిని ఆవాహన చేస్తారు. వేదిక మీద దేవీ ప్రతిమలను నిలిపి కేశసంస్కారాది ద్రవ్యాలను సమకూరుస్తారు. విదియ నాడు కేశబంధన సేవ, తదియనాడు దర్పణ ప్రదానం, అలంకరణ ద్రవ్య సమర్పణం, చవితినాడు మధుపర్క సమర్పణం, పంచమినాడు షోడశోపచార పూజ చేస్తారు. షష్ఠినాడు సాయం సమయములో బిల్వతరుబోధన చేస్తారు. ఇది దక్షిణాయనం కనుక (దేవతలకు రాత్రి పూట కనుక) దేవతలు నిద్రావస్థలో ఉంటారు. రావణవధ సందర్భంలో దేవ విజయాన్ని కోరి బ్రహ్మ దేవీపూజ చేసినప్పుడు, పంచమినాడు కన్యకారూపంలో కనిపించి 'మర్నాడు బిల్వవృక్షం మీద నిద్రపోతున్న నన్ను మేల్కొల్పు'మని చెప్పింది. ఆ సంఘటనకు సూచకంగా బిల్వతరుబోధన నవరాత్రి పూజలో చేరింది. బిల్వతరువు వద్ద ఈ తంతు జరిగేటప్పుడు 'ఆ నాడు రావణవధార్థం, రామ విజయార్ధం నిన్ను మేల్కొల్పాడు. అలాగే షష్ఠినాడు నిన్ను నేను అకాలంలో మేల్కొల్పుతున్నాను' అంటారు.

తరువాత సప్తమి నాడు స్వగృహంలో షోడశోపచార పూజ చేస్తారు. అష్టమినాడు ఉపవాసముండి, సప్తమాతృకా సహితయైన దేవిని (అష్టశక్తి) పూజిస్తారు. నవమినాడు ఉగ్రచండ్యాది పూజలు గాని, మహాలక్ష్మి పూజలు గాని జరుపుతారు. ఈ నాటి హోమాదులతో, విశేష పూజాదులతో నవరాత్రి పూజ పూర్తవుతుంది. దశమినాడు ఉదయం గాని, సాయంకాలం గాని, దేవిని మంగళ వాద్యాలతో ఊరేగిస్తూ వెళ్ళి నదీ జలాల్లో నిలిపివస్తారు. దీనినే దేవీ ప్రస్థానము, మహాపూజ, గౌరమ్మ నీళ్లట అని అంటారు. మనవారు ఆదిశక్తిని కన్యకగా భావించటం వల్ల ఈ నవరాత్రులలో నిత్యం కన్యకలను పూజిస్తారు. కొందరు సుమంగళీ పూజలు కూడా చేస్తారు.

మూడు రాత్రుల పూజ

దేవిని మూడు రాత్రులు మాత్రమే పూజించేవారు. మూలా నక్షత్రయుక్తమైన సప్తమినాడు కలశ స్థాపనాదులు చేస్తారు. ఆ నాడు సరస్వతీ పూజ జరిపిస్తారు. సరస్వతీ పూజను అష్టమినాడు, నవమినాడు చేయడం కూడా ఉన్నది.