ఎత్తిన దుర్గావతారం, మాతంగి అవతారం, అరుణుడనే రాక్షసుణ్ణి భ్రమరాల (తుమ్మెదల) సహాయంతో వధించిన భ్రామరీ అవతారం అన్నవి. దేవి మొత్తం తొమ్మిది అవతారాలు ఎత్తింది. ఈ నవావతారాలతో విలసిల్లిన తల్లిని నవాక్షరీ మహామంత్రంతో జపించాలి. ఈ నవావతారాలకు, నవాక్షర మహామంత్రానికి, శ్రీచక్రంలోని నవావరణలకూ, దేవిని నవరాత్రులు పూజించటానికి ఆధ్యాత్మికము, అంతరికమూ అయిన సంబంధం ఉంది.
తొమ్మిది దినాలు దేవీపూజ జరుపుకోలేని వాళ్ళు సప్తమి మొదలు మూడు రాత్రులు, పంచమి మొదలు ఐదు రాత్రులు, తదియ మొదలు ఏడు రాత్రులు. దుర్గాష్టమి మొదలు మహానవమిగా ఒక రాత్రి జరుపుకుంటారు.
దేవీ నవరాత్రులు - పూజా కల్పవిభేదాలు
దేవీ నవరాత్రులను శరదారంభంలోనే కాకుండా వసంతారంభంలో చైత్రశుద్ధ ప్రథమ నుంచి కూడా జరుపుకోవచ్చని నిర్ణయ సింధువు అను ధర్మశాస్త్ర గ్రంథము వల్ల తెలుస్తున్నది. వసంత శరత్తులు రెండూ నానారీతి వ్యాధులకు నిలయాలు కనుక వీటికి యమదంష్టికలని పేరు. అనగా యముని కోరలని యర్థము. ఈ కారణం వల్ల ఈ రెండు ఋతువులలోనూ దేవీనవ రాత్రులు జరుపుకోవాలని భాగవతం చెపుతున్నది. అయినా శరత్తులోని నవరాత్రులే దేవీనవరాత్రులుగా ప్రఖ్యాతి వహించాయి.
దేవీ పూజకు విధానాన్ని తెలియజేసే ప్రతిపదాది, నవమ్యాది, షష్ట్యాది, సప్తమ్యాది, అష్టమ్యాది, అష్టమీ, నవమీ కల్పాలనే ఏడు కల్పగ్రంథాలు ఉపాసకుల కోసం ఏర్పడ్డాయి. వీటిని అనుసరించి జరిగే దేవీ పూజ సాత్త్వికి, రాజసి, తామసి అనే ప్రధాన భేదాలతో ఉంటుంది. జపయజ్ఞాదులు, మాంసరహిత నైవేద్యాలతో కూడినది సాత్త్వికీ పూజ. జపయజ్ఞాలు లేక, బలులు, మాంస నైవేద్యములతో కూడింది రాజసిక పూజ. సురామాంసాది నైవేద్యాలతో చేసేది తామసిక పూజ. ఉపాసకుల గుణ, ప్రయోజనాలను బట్టి ఈ మూటిలో ఒక విధమైన పూజా విధానాన్ని అనుసరిస్తారు. సాత్వికతత్వం గల మహర్షులు మొదలైన వారు సాత్వికిని, రజఃప్రవృత్తి గల రాజులు, వీర పురుషులు రాజసిని, తమః ప్రవృత్తి గల రాక్షసులు, రాక్షసత్వం గలవారై తామసిని ఆదరిస్తుంటారు. ఎట్టి చిత్తవృత్తితో దేవిని పూజిస్తే అట్టి ఫలం కలుగుతుంది. కానీ సత్యపదార్థ తత్త్వం గోచరించడానికి, దేవీ శ్రద్ధ కలగడానికి శుద్ధ సాత్విక స్థితి (సాత్విక సాత్వికం) అత్యవసరం. మోక్షాపేక్ష గలవారికి సాత్వికమే సంశయ రహితమయిన మార్గం.