పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

- మహాసరస్వతి - మహాలక్ష్మి - మహాకాళి

జగన్నియంతృత్వాన్ని లీలగా కలిగిన పరమాత్మ సృష్ట్యాది క్రియా కలాపాలను నిర్వర్తించడం కోసం ఆదిశక్తిని ఆధారంగా గ్రహించి, పురుష రూపంలో గాని, రూపంలో గాని అవతరించడం కలుగుతుంది. పురుష రూపంలో అవతరించినప్పుడు బ్రహ్మ, విష్ణు, రుద్రరూపాలను, స్త్రీ రూపంలో అవతరించినపుడు మహా సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి రూపాలను ధరించడం జరుగుతుంది. త్రిమూర్తులలో బ్రహ్మ రజోగుణ ప్రధానుడు, విష్ణువు సత్త్వగుణ ప్రధానుడు, రుద్రుడు తమోగుణ ప్రధానుడు. త్రిశక్తులలో మహాసరస్వతి రజోగుణ ప్రధాన, బ్రహ్మీరూప, ఈమె ముఖ్యంగా జగదుత్పత్తి చేస్తుంది. జ్ఞాన సంచారాన్ని చేస్తుంది. విద్యాజ్ఞానాలకు అధిష్టానమైన ఈ తల్లి బుద్ధి, కవిత, మేధ, ప్రతిభ మొదలైన శక్తులను ప్రసాదిస్తుంది. వ్యాఖ్యా బోధల మూలంగా సమస్త సందేహాలను తీరుస్తుంది. ఈమె విచారణ కారిణి, గ్రంథకారిణి. మహాలక్ష్మి సత్త్వగుణ ప్రధాన.

దేవీపూజ - దిన సంఖ్య

దేవీపూజ భారతదేశములోనే కాక కొన్ని ఇతర దేశాల్లో కూడా ఏదో రూపంలో కనిపిస్తున్నది. కానీ ఆ దేశాల వారు భారతీయుల వలె దేవిని సమగ్ర రూపంలో భావించి, ధ్యానించి, దర్శించి పూజిస్తున్నవారు కారు. వారి పూజా విధానంలో జ్ఞాన విజ్ఞానాలు, లౌకికత - ఆధ్యాత్మికతలు, కామ నిష్కామములు, పరిపూర్ణ రూపంలో ప్రస్ఫుటితాలు ఐనట్లు కనుపట్టవు.

ఆదిశక్తి లోకవిద్రోహాన్ని తలపెట్టి, సాధుజన సంతాపాన్ని కలిగిస్తున్న కొందరు రాక్షసులను సంహరించడానికి స్త్రీ రూపంతో అవతరించింది. ఈ శ్రీదేవి మధుకైటభులను సంహరించడం కోసం, మహాలక్ష్మిగా అవతరించింది. మహిషాసురుణ్ణి సంహరించడం కోసం, మహాకాళిగా అవతరించింది. శుంభనిశుంభులను సంహరించడం కోసం మహాసరస్వతిగా అవతరించింది. ఇవికాక మరి ఆరు అవతారాలెత్తినట్లు దేవీ మాహాత్మ్యం వల్ల తెలుస్తున్నది. అవి శ్రీకృష్ణభగవానుని జన్మ సమయంలో కంసవధాప్రయత్నం కోసం నందుని ఇంట పుట్టి, కంసుడు సంహరింపబోయినప్పుడు అదృశ్యురాలైన మహా మాయావతారం, మహాక్రూరుడైన ఒక రాక్షసుణ్ణి వధించటం కోసం ఉదయించి, వధవేళ దంతాలను రక్తవర్ణం చేసుకున్న రక్తదంతి అవతారం, నూరేళ్ళ క్షామ మేర్పడ్డప్పుడు ప్రజల బాధలను తీర్చటానికి శాక ఫలాదులను ప్రసాదించిన శాకంభరి అవతారం, దుర్గుణ్ణి సంహరించటానిక