శరన్నవరాత్రులనీ, దేవీ నవరాత్రులనీ పేర్లున్నవి. సంవత్సరాత్మకమైన కాలచక్రములో ఆశ్వయుజ కార్తిక మాసాలలో ఏర్పడే శరదృతువుకు ప్రత్యేక ప్రాముఖ్యమున్నది. తమోగుణ ప్రధానమయిన వర్షఋతువు వెళ్ళిపోయి ఆకాశం మేఘరహితం కావడం వల్ల ఈ ఋతువులో చంద్రకాంతి మిక్కిలి తేజోవంతమయి విలసిల్లుతుంది. భూదేవికి (స్త్రీ) పురుషుడికీ పునస్సమాగమం చేకూరుతుంది. మహాలయ అమావాస్యతో అంతమయిన సంవర్తక క్రియ నుంచి బయటపడ్డ ప్రకృతి పునఃసృష్టికి పూనుకుంటుంది. పరమేశ్వరికి అంశావతారమయిన సరస్వతి నవమాసాలు మోసి నూతన సృష్టి అనే నవబాలను ప్రసవిస్తుంది. ఆ తల్లి నవ మాస గర్భధారణకు ప్రతీకలే ఈ నవరాత్రులు. జ్యోతిష శాస్త్ర దృష్ట్యా విశేష ప్రాముఖ్యమున్న శరత్తులో జరిగే పండుగలు కాబట్టి ఈ ఉత్సవాలకు 'శరన్నవరాత్రు'లన్న పేరు వచ్చింది.
సృష్టి, స్థితి, సంహారాలకు నియంతలైన మూలపురుషులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. సరస్వతి, లక్ష్మి, దుర్గ (చండి, కాళి) మువ్వురూ వీరి శక్తులు. పరాశక్తి (ఆదిశక్తి, మహామాయ) అంశావతారాలైన వీరిని ప్రధానంగాను, కలాంశావ తారాలయిన బాల, లలిత, శ్యామలాదేవి దేవీ మూర్తులను సముచితంగానూ, ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన ఆదిశక్తిని పూజించటం ఈ నవరాత్రులలో జరగడం వల్ల ఈ పండుగలకు దేవీ నవరాత్రులన్న పేరు కలిగింది.
దేవీ స్వరూప నిరూపణము
సృష్టి స్థితి లయాలను సంపాదించగలిగేది శక్తి. ఈ శక్తి, ఆదిశక్తి, పరాశక్తి, విష్ణుమాయ, యోగమాయ, పరమేశ్వరి, రాజరాజేశ్వరి, ప్రకృతి, మూలప్రకృతి, శ్రీ మున్నగు నామాలతో వ్యవహరించబడుతున్నది. ఈ ఆదిశక్తి స్ఫురణ వల్లనే బ్రహ్మాది త్రిమూర్తులు 'సృష్టి, స్థితి, సంహారా’లను చేయగలుగుతుంటారు. ఈ జగదంబ దేవతల్లోనూ, మానవాది భూతకోటిలోనూ నానావిధమైన అంశ విభేదాలతో, నానావిధ నామ రూపాలతో వర్తిస్తుంటుంది. జీవులు, మానవులు, దేవతలు ఈ శక్తి ప్రేరణ వల్లనే సుఖ దుఃఖానుభవాలను పొందుతుంటారు. అందువల్ల ఈ పరదేవిని దేవమానవాదులందరూ పూజించి, సేవించి శక్తి సంపన్నులౌతుంటారు. ఈ ఆదిశక్తి పురుష రూప అని కొందరు, స్త్రీ రూప అని కొందరు చెపుతుంటారు. కాని దేవీ భాగవతంలో ఈ పరాశక్తి తనను ధ్యానించి దర్శనాన్ని అర్థించిన బ్రహ్మకు సాక్షాత్కరించి 'పురుషుడను నేనే, స్త్రీని నేనే, ఇరువురిలో భేదము లేదని ఎవడు తెలుసుకుంటాడో అతడు ధీశాలి' అని పలుకుతుంది.