పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


హైంగోయనుల (చైనీయులలో నొక జాతి) చంద్రుఁడు వారి సహస్రమయూఖుని వలె నమృతపాన మొనర్చుటయందు సమర్థుఁడు కాకపోవుటచే స్వర్గమున కేఁగుచు మార్గమధ్యమున నిలచిన త్రిశంకువు. రాత్రులందు మాత్రమే కాంతినొసఁగు క్షపాకరుని బట్టి కట్టి, సర్వకాల సర్వావస్థలఁ కౌముదీప్రదాన మొనర్పుమని నిర్బంధించుటకై 'త్సిన్' జాతివారి పూర్వులు మిన్నందుకొను సౌధముల నిర్మింప, నది గని యా 'త్సుకియోమి' యుగ్రుఁడై యొక ప్రళయకాలవర్షమును గల్పించి యవ్వానిని నేలమట్టము గావించె నఁట!

'షాహూర్' మహమ్మదీయుల చంద్రదైవతము, జారచోర గూఢచారుల కితఁ డిష్టప్రదాత. గ్రీకుల చంద్రుఁడు హెలియస్ (సూర్యుఁడు), ఇవోయస్ (ఉషస్సు) లకుఁ దోఁబుట్టువు.

    సీ. [1]ఒక వేయి తలలతో నుండ జగన్నాథు
             బొడ్డుదమ్మిని బ్రహ్మ పుట్టె మొదట
       నతని గుణమ్ముల నతనిఁ బోలిన దక్షుఁ
             డగు నత్రి సంజాతుఁ డయ్యె నత్రి
       కడగంటి చూడ్కులఁ గలువల సంగడీఁ
             డుదయించి విప్రుల కోషధులకు
       నమర ధరాతతి కజుని పన్పున నాథుఁ
             డై యుండి రాజసూయంబు సేసి’ -

మూఁడులోకముల జయించినట్లు మన భాగవత పురాణము పల్కుచున్నది. చంద్రుని యసమానాభిజాత్యసౌభాగ్యములఁ బరికించి దక్షప్రజాపతి తన కుమార్తెల నిర్వది యేడ్వురఁ దారకల నతని కిచ్చి యుద్వాహము గావించెను. కాని క్షపాకరుఁడందు రోహిణీదేవి యెడ గాఢానురాగము గలవాఁడై మెలంగ మొదలిడినాఁడు. అట్టి సమయమున మిగిలినవారు తండ్రికడకేఁగి తమ దుఃస్థితిని విన్నవింప దక్షుఁడు రోహిణీప్రియుని [2]రాజక్షయవ్యాధిగ్రస్తుండవు కమ్మని శపించినాఁ డఁట!

భారతీయుల యాచారవ్యవహారము లనేకములు చంద్రునిపై నాధారపడి యున్నవి. చాంద్రమానము కర్మిష్ఠుల క్రతుదీక్షల కాధారము. కృచ్ఛచాంద్రాయణాది వ్రతవిధానముల యోగిపుంగవులు మహత్తర శక్తిసామర్థ్యముల సంపాదింతురు. సంక్రాంతిద్వయమధ్యమున గౌణచంద్రుఁడు, ముఖ్యచంద్రుఁడు నిరువురును గన్పట్టిన

శుభకర్మల కెన్నింటికో హంసపాదులు. కుముదాప్తు కొమ్ము తఱిఁగినఁ గాటకము
  1. ఒక వేయి తలలతో - పోతన భాగవతము
  2. రాజయక్ష్మము - కుమార్తెల మొఱవిని క్రుద్ధుఁడైన దక్షునకుఁ జంద్రునకు సంధికుదిర్చి శివుఁడర్ధభాగమును శిరముపై ధరించినట్లు బ్రహ్మవైవర్తపురాణము

____________________________________________________________________________________________________

28

వావిలాల సోమయాజులు సాహిత్యం-4