పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వాదోపవాదము లొనర్చుకొని తుదకుఁ గలహించిరి. స్త్రీ జనసహజమగు రోషోద్రేకము హెచ్చి చంద్రాదేవి యంజలితో నెత్తి యాదిత్యుని ముఖముపై వాలుకాకణములఁ జల్లినది. సహస్రకరుఁడు దానిని భరింపఁజాలక వేయి చేతులతో సైకతమును గ్రహించి యామెపై మహత్తరశక్తితోఁ గొట్టినాఁడు. చంద్రముఖమున నీ నాఁటికి నవి నీలాంకములై నిలచియున్నవి.

చంద్రసూర్యుల కలహము తుదకెట్లో సమసి యిరువురకును సంధి జరిగినది. పరస్పర పాణిగ్రహణానంతర మా నూతనవధూవరులు గాఢానురాగముతోఁ గొంత కాలము కాఁపుర మొనర్చిరి. మఱల మనఃస్పర్ధ లేర్పడఁ జంద్ర సౌందర్య గర్వగా వునఁ దీక్ష్ణుమయూఖుని మైత్రి నసహ్యించుకొని యాతనికి విడాకులిచ్చినది. సూర్యుని వలనఁ దనకుఁ గలిన సంతానము జూడఁజాలక యామె ఖడ్గముతో ఖండించి యా ముక్కలను గగనవీథి కెగురవైచెను. అందాకసమున నిల్చినవి నక్షత్రములై భాసించు చున్నవి. నేలపైఁ బడినవి జలచరములై జీవించుచున్నవి. ఇది 25[1]ఫిలిప్పైన్ జాతివారి చంద్రసూర్య కథనము.

నీగ్రోజాతి పుక్కిటి పురాణములందు సూర్యచంద్రలిరువురును స్త్రీమూర్తులు. వారొకరి సంతానము నొకరు చంపుకొని తినుటకు సంధి జేసికొనిరి. ఇందుకు విరుద్ధముగ మాతృహృదయము గల చంద్ర మమకారముతోఁ దన సంతానమును సూర్యదేవి కంటఁ బడకుండునట్లు పవలెల్ల దాచియుంచి రేలు వారితో ముద్దుముచ్చటలు తీర్చుకొనుచున్నది. రాత్రులం దాకాశమున మిలమిలలాడు నక్షత్రములే యాచంద్రాదేవి సంతానము. ఆదిమయుగముల రవి భూమి మీఁద నివసించెడివాఁడు. 'టిట్రిరే' యను నాఖేటశ్వానమొం డతని నొకనాఁడు వెంబడించి పట్టుకొని మ్రింగివేసినది. అతని శల్యమొకటి వాయుపథమున కెగసి యట నేఁడు లవిత్రాకారమున గగ నాంగణమునందు మొఱయు చున్నది. ఇదియే వున్నమినాఁడు షోడశ కళాపరిపూర్ణుఁడైన చంద్రునివలెఁ బ్రకాశించుచున్నదనియు [2]రెడ్ యిండియన్ జాతివారి నమ్మకము. వారి నాయకుని డాలు పైఁ జిత్రితమైన చంద్రరూపమే నిశాసమయముల నభోవీథి కెగసి చంద్రికాప్రసార మొనర్చునని యొప్పోజా జాతివారి గ్రామ వృద్ధులు జానపద సాహిత్యమునఁ జంద్రునిఁ గీర్తించు చున్నారు.

[3]షింటోల చంద్రదేవతకు 'త్సుకియోమి' యని పేరు. అతఁడు వారి పరమాత్మ

యగు 'ఇజానగి' దక్షిణనేత్రము నుండి యుద్భవిల్లినాఁడని వారి నిశ్చితాభిప్రాయము.
  1. ఫిలిప్పైన్ జాతి : ఫిలిప్పైన్ ద్వీపముల నివసించు నాదిమవాసులు
  2. రెడ్ ఇండియనులు - కొలంబస్ ఇండియా యను భ్రాంతితోఁ గనుగొన్న యమెరికా ద్వీపములందలి యాదిమనివాసులు
  3. షింటోలు - జపానీయులు 'Shintoism is the pure land school of Japan in its extreme form of Salvation by pure faith'

____________________________________________________________________________________________________

మణిప్రవాళము

27