పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తప్పదని గదా కర్షకలోకపు గాఢవిశ్వాసము! విద్యారంభ, వివాహాదికముల జ్యోతిష శాస్త్రాభిజ్ఞులు చంద్రలగ్నమున కత్యధిక ప్రాముఖ్యము నిచ్చుచున్నారు. రాజవైద్యులకు శ్రుతిమించిన హృద్రోగముల భూతవైద్యులు చంద్రదేవతకు జపమొనర్చి నవోదనదానమున నా గ్రహదుర్వీక్షఁ దొలఁగించుచున్నారు.

చంద్రలోకము పితృలోకము. సప్తసంతానాదికముల యథావిధిఁ దీర్చిన పుణ్యపురుషులు చంద్రలోకమును జేరుదురు. [1]ఉత్క్రాంతి వేళ జీవుఁడు రజనిని జేరునఁట! రాత్రి యాతనిఁ గృష్ణపక్షము కడకును గృష్ణపక్షము దక్షిణాయనము కడకును దీసికొని పోవునఁట!! అటనుండి భౌతికాకాశమునకుఁ బిమ్మట జంద్రలోకమునకుఁ జేరి పూర్వసంచిత పుణ్యవిశేషమున నా లోకమునం దుదకశరీరము నొంది జీవి కర్మక్షయ మగువఱ కటనుండు నఁట!! తఱువాత నా జలశరీరధారి గగనమార్గమున వాయుపథమును జేరుకొని వారిదద్వారమున వర్షాకృతితో మఱల నవని జన్మించు నఁట!!

ప్రణయవిహ్వలులైన నాయికానాయకులు ప్రణయవార్తావహులుగఁ బ్రవర్తింపఁ జేతనాచేతనముల నర్థించుటలు కవిలోక ప్రసిద్ధములు. మేఘశుకపికాదుల కనంతవాక్ప్రౌఢిమను బ్రసాదించి దూతకృత్యములఁ దీర్చుటచే సమస్త చరాచరప్రకృతి నేకసూత్రమున బంధించి దర్శించిన మహాకవులు ద్రష్టలు, రసజ్ఞశేఖరులు. కవికులగురువు కాళిదాసుని మేఘసందేశము జగద్విదితము కదా! దమయంతికై దౌత్యము నెఱపిన సురజ్యేష్ఠు వాహనమగు జాలపాదమును మఱచుటెట్లు? చిలుక రాయబారము లాంధ్రసీమంతినీ సాహిత్యమున సుప్రసిద్ధములు. సీతారామచంద్రులకు దౌత్యమును శ్రీకృష్ణచంద్రతర్కాలంకారుఁడునుం జంద్రుని మూలమున నడపినాఁడు. శ్రీ విశ్వనాథ మానినీపరాఙ్ముఖతను మాన్పి ప్రసన్నను జేయుమని [2]శశి నర్థించినాఁడు. మహాకవి కాళిదాసుని మేఘ సందేశమున మేఘసౌభాగ్య సమస్తమును గన్పట్టునట్లు వీరి శశిదూతమున చంద్రసర్వస్వము గోచరించును.

చంద్రునిపైఁగల యనంతాభిముఖ్యముచే శాస్త్ర కర్తలు తమ గ్రంథములకుఁ జంద్రిక, కౌముది, చంద్రాలోకాది స్నిగ్ధ నామములఁ బ్రసాదించినారు. [3]మేఘవిజయ కవి హైమ కౌముది, భట్టోజి దీక్షితుని కౌముది, జయదేవుని చంద్రాలోక మిందుకు నిదర్శనములు.

నక్షత్రములు తమస్వినుల భాసించుటయుఁ గౌముదీ రాత్రులఁ గన్పింపక

పోవుటయుఁ జూచి కాలమను కళాదుఁడు గగనమూషిక నుడురౌప్య ఖండములఁ
  1. ఉత్క్రాంతివేళ : మరణవేళ
  2. శశినర్ధించినాఁడు'; శ్రీ విశ్వనాథ సత్యనారాయణ 'శశిదూతము' కావ్యమున జెప్పినారు.
  3. మేఘవిజయకవి (క్రీ.శ. 1660 ప్రాంతము) హైమకౌముది యనునితని వ్యాకరణ గ్రంథమును భట్టోజి దీక్షితు లనుకరించినారని కొందఱు, భట్టోజి (క్రీ.శ. 1640 ప్రాంతము) అద్వైతాగమ, తంత్రధర్మజ్యోతిషాదికములు ముప్పది రెండు గ్రంథములు రచించిన మహాపండితుఁడు.) సిద్ధాంత కౌముది సంస్కృత వ్యాకరణమును శబ్దరూప నిష్పత్తి క్రమమున మార్చి వ్రాసిన పన్నెండువేల గ్రంథము.

____________________________________________________________________________________________________

మణిప్రవాళము

29