Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చేయవలసిందే. ఇండియా, ఇండో చైనా, చైనా, జపాన్ దేశాలలో ఇది అనేక జాతుల్లో ఆచారంగా ఉంది. ఇండియన్ ఆర్చి పెలగో, ఆఫ్రికా, దక్షిణ అమెరికాలల్లోను కొన్ని కుటుంబాలలో ఇదే పద్ధతి. ఎస్కిమో జాతిలోను, మకరంగాలలోనూ (ఆఫ్రికా) ఇదే ఆచారం. ఈ రీతిగా సేవ చేస్తూ ఉన్న భర్త మంచి గుణాలు లేనివాడనిపిస్తే, ఎప్పుడైనా అతణ్ణి కన్యక తండ్రి ఇంట్లోనుంచి వెళ్ళిపొమ్మనవచ్చును. అటువంటి సందర్భాలలో భార్యాభర్తలకు కలిగిన సంతానం కన్యక కుటుంబానికి చెందటమే కనిపిస్తున్నది.

ఈ సేవా వివాహానికి (Marriage by service) ముఖ్యోద్దేశం భర్తకంటే భార్య అవసరాలని నిరూపించడమే అయినట్లు అవగతమవుతున్నది. ఇటువంటి వివాహాలు జరిగినప్పుడు స్త్రీకి విశేష స్వాతంత్య్రము ఉన్నది. ఆసుర వివాహంలో కేవలం శుల్కమిచ్చి విక్రయించుకున్న భార్యకు ఇటువంటి స్వేచ్ఛ ఉండడానికి అవకాశం ఏ మాత్రమూ లేదు. సర్వ సామాన్యంగా అనాగరిక జాతుల్లో స్త్రీ పొందే నైచ్యాన్నీ, అగౌరవ భావాన్నీ తీసివేయడానికే ఇటువంటి సేవలక్షణం. ఆసుర వివాహంలో ఒక భాగంగానూ, ప్రత్యేక వివాహ విధానంగానూ ఏర్పడి ఉంటుందని విజ్ఞుల అభిప్రాయం.

పురాతన గ్రీసు దేశంలోని స్పార్టాలో 2/5 వంతు దేశం స్త్రీకి కట్నంగా వచ్చినదేనని ఎరిస్టాటిల్ చెప్పినాడు. న్యాయ సమ్మతమైన భార్యకు 'డాన్' (స్త్రీ ధనం) ఇవ్వటము ఒకానొకనాడు రోమనులు విశేషంగా గౌరవించేవారు. భార్య దానిని నూత్న గృహ నిర్మాణం కోసం భర్తకిచ్చి తర్వాత పుచ్చుకుండేది. ఇటువంటి ఆస్తిని తాకట్టు పెట్టడానికి గాని, అమ్మడానికి గాని భర్తకు ఎటువంటి అధికారమూ రోమన్ ధర్మశాస్త్రం అంగీకరించలేదు. భర్త కట్నంగానూ భార్య శుల్కంగాని, లేక స్త్రీ ధనంతో గాని నూతన గృహాన్ని ఏర్పరచుకొని కొంతకాలం కాపురం చేసి, విభేదాలొచ్చి విడాకులు పుచ్చుకుంటే, ఆ ఆస్తిని ఇరువురూ సమానంగా పంచుకునేవారు.

క్రీ.పూ. 1955లో బాబిలోనియా రాజు హమ్మురబీ, భర్త భార్యను ఇంట్లోనుంచి వెళ్ళగొడితే, ఆమె స్త్రీ ధనాన్ని ఇచ్చివేయవలసిందే అని శాసించాడు. 'ఇటలీలోని స్త్రీలు' అనే గ్రంథంలో విలియం బౌల్డింగ్ మహాశయుడు స్త్రీ ధనాన్ని గురించి నానా విధాలైన నియమాలను, విచిత్రాలను వివరించాడు. ఇటువంటి లక్షణాలే ఇతర జాతుల్లోను, దేశాల్లోను ఉన్నవి. ఆసుర వివాహంగా ఉన్న సేవకుడు కేవలం సేవకుడు. భవిష్యత్తులో జామాత. ఇది అతనికి కేవలం పరీక్షాసమయం. విరివిగా కనిపించే బహూకృతులు, తదితరాలు ఉభయకులాల మధ్య సఖ్య బంధాన్ని అభివృద్ధి చేయడం కోసంగానే కనిపిస్తున్నవి. ఈ విషయమే జాఫెర్సన్ సైబీరియాలోని యూకాగిర్ జాతి