పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అని నిశ్చయంగా చెప్పవచ్చును. ఇది ఆంధ్రదేశంలో నేటికీ విరివిగా కనిపిస్తున్నది. ఈ శుల్కం స్త్రీ ధనంగా మారటమూ, శుల్కాన్ని స్త్రీకే ఇవ్వటమూ ఆసుర వివాహ విధానంలో మరొక మెట్టు పైకెక్కినట్లు వ్యక్తం చేస్తున్నవి. కొన్ని మహమ్మదీయ జాతుల్లో క్రీ.పూ.100 సంవత్సరాలనాడే శుల్కంగా ఇవ్వటానికి కన్య అయితే ఒప్పుకున్న రెండువందల దీనారాలు గానీ, విధవ అయితే ఇవ్వవలసిన నూరు దీనారాలుగానీ, స్త్రీ ధనం కావటం ఏర్పాటైంది. దీనికోసం భర్త ఆస్తి తాకట్టైనా పెట్టవలసి వస్తుంది. వివాహం జరిగినట్లు నిశ్చితం కావలెనంటే, స్త్రీ ధనమైన 'సాదక ' ను తండ్రిపరం చేయవలెనని కొరాను పలికింది.

భారతదేశంలో 'స్త్రీధనం' మనువు నాటినుండి ఏర్పాటైంది. టుటానిక్ జాతుల్లో క్రీ.శ. 6వ శతాబ్దంలో కాని జరుగలేదు. పితృస్వామికాలైన కుటుంబాలలో ఈ స్త్రీధనం భర్త దగ్గరే ఉంటుంది. అతని మరణానంతరం ఆమెకు అతని రాబడిలో నుంచీ భృతికి ఏర్పాటు జరగడం వచ్చింది. మొన్నమొన్నటివరకూ యూరప్, జర్మనీ, స్విట్జర్లండు దేశాలలో వివాహ సమయంలో ఆచారంగా ఉన్న 'ఉదయప్రదానము’ (Morgengabio) లేక 'మార్నింగ్ గిఫ్ట్' శుల్కానికీ, స్త్రీధనానికి సంబంధించింది. ఇటలీలోని 'కాయిల్' ఇటువంటిదే.

ఆసుర వివాహంలో 'సేవాశుల్కం' అనే ఒకానొక విధానం అనేక జాతుల్లో కనిపిస్తుంది. తండ్రికి కొంతకాలం సేవ చేసి పిల్లను పొందటమే దీని లక్షణం. ధనం ఇచ్చే బదులు 'శరీర సేవ' చేస్తూ ఉండటం వల్ల దీనిని కూడా శాస్త్ర శుల్క వివాహం (Marriage by Purchase) గా భావించారు. కొన్ని జాతుల్లో శుల్కం చెల్లించినా కన్యక తండ్రికి వరుడు కొంతకాలం సేవ చేస్తేగాని భార్య దొరకదు. ఇటువంటి సందర్భాలలో జరిగే వివాహాన్ని ఆసుర వివాహము (Marriage by Purchase) అనటానికి వీలు లేదని ఫీల్డింగు అభిప్రాయము. ఇటువంటి వివాహానికి ఉదాహరణంగా బైబిలులో (Genisis – XXIX) జాకోబ్, రాఖిలోల - కథ కనిపిస్తూ ఉన్నది. మాతృస్వామికాలైన కుటుంబాలలో కన్యక కుటుంబానికి వరుడు కొంతకాలం సేవ చేస్తే గాని భార్య లభించదు; అతనికి ఆస్తి లేకపోతే ఎంతకాలమైనా ఆ కుటుంబానికి సేవకుడుగా ఉండవలసి వస్తుంది; అయితే పితృస్వామికాలలో (Patriarchal) సేవజేయవలసిన కాలానికి ఒక పరిమితి అంటూ ఉంటుంది. ఈక్విడార్లో కానిలాస్ ఇండియనులలోను, బ్రేజీలు ఇండియనులలోను యూకటులున లోను ఇదే ఆచారం. ఉత్తర ఆసియాలో నిగేరియా, కొరయక్, చుక్ చీ జాతి యువకుల్లో ఈ విధంగా భార్యకు సేవ