వంతులమీద చెల్లించినపుడు అతనికి కలిగే సంతానానికి తొమ్మిది పది సంవత్సరాలు కూడా రావచ్చును. చిన్ కొండజాతుల్లో ఈ శుల్కాన్ని జీవితాంతం చెల్లిస్తూ ఉంటాడట. దీనినిబట్టి అనాగరక జాతులు కూడా అనేకమార్లుగా క్రయధనం పుచ్చుకోవటం వల్ల ఉండే నష్టాన్ని గ్రహించినట్లు అర్థమౌతున్నది. మొత్తం చెల్లింపలేని పక్షంలో పిల్లతండ్రికి కుటుంబము పెరగటమూ, కుమార్తె భర్తతో ఇంట్లోనే ఉండి అతని 'పనిపాటలు' చేసి పెట్టుతూ ఉండటం వల్ల, ఇటువంటి పద్ధతినే విశేషంగా కొన్ని జాతులు ఆదరించేవని ప్రపంచ వివాహ చరిత్ర కారులు వెస్టర్ మార్కు అభిప్రాయము.
రాక్షసంగా కన్యను ఎత్తుకోపోయి వివాహం చేసుకోవటం మొదటి మెట్టు. దానికి ప్రతిగా ఆసురము వచ్చింది. వెల ఇంత అని నిశ్చయం చేయటం కష్టమనిపించినప్పుడు ఆసుర వివాహంలోనే 'బదులుకు బదులు' (Marriage by Exchange) అనే పద్ధతి ఆచారంగా కొన్ని జాతుల్లో ఏర్పడ్డది. అంటే భార్య లభించవలెనంటే ఒక స్త్రీని బదులు ఇవ్వవలసి వచ్చిందన్న మాట. కుమార్తెలుంటే వధూవరుల తండ్రులు ఈ మారకం చేస్తారు; చెల్లెలుంటే అన్నదమ్ములు చేస్తారు; చెల్లెళ్లు లేనప్పుడు పినతండ్రి కూతుళ్ళనూ, పెత్తండ్రి కూతుళ్ళనూ మారకం చేయవచ్చు. మలనీషియాలోని సోలామన్ జాతిలో మొదటి స్నేహితాలు అభివృద్ధి చేసుకోవటానికి ఏర్పడ్డ స్త్రీల మారకం శుల్క వివాహంగా పరిణమించింది. దక్షిణ ఆస్ట్రేలియాలో వరినోరీ జాతి స్త్రీ, తనకు బదులుగా తల్లిదండ్రులు మరి ఒక ఆడపిల్లను ఇవ్వని పురుషుణ్ణి వివాహం చేసుకోటం అగౌరవంగా భావిస్తుందట. ఇటువంటి ఆచారాలు న్యూ గినీ, న్యూ హెబిడ్రిన్, సొలోమన్, సుమత్రా ద్వీపాలలో ఉన్నవి. సుమత్రా ద్వీపవాసులు 'జూజు' (కన్యాశు ల్కం) ఇవ్వటానికి బదులుగా స్త్రీనే ఇస్తారట. న్యూ సౌత్ వేల్సులో కుంబూ, మూరి జాతుల్లో శుల్కం బదులు వివాహం ఉంది.
కొన్ని జాతుల్లో ఈ శుల్కానికి తోడు ఆడపిల్లల కన్యాత్వాన్ని (Virginity) కాపాడినందుకు తల్లికి కొంత ధనమూ, అంగీకారం ఇచ్చినందుకు అక్కచెల్లెండ్రకూ, తండ్రికీ కొంత ధనమూ ఇవ్వవలసి ఉంటుంది. ఈ ధనమంతా తిరిగి అవసరమని తోచినప్పుడు ఇచ్చివేసి పిల్లను తెచ్చుకోవటం, ఆఫ్రికా జాతులు కొన్నిట్లో ఆచారంగా ఉందని వెస్టర్మార్క్ అభిప్రాయం. 'పశుధనానికి' అమ్ముడుబోయిన స్త్రీని కాఫిర్ జాతులు తక్కువగా చూస్తారు. కొన్ని జాతుల్లో ఈ ధనాన్ని వివాహానంతరం స్త్రీ ధనంగా మార్చి ఉంచుతారట. నేటి వైవాహిక విధానాలలో బహుమతులుగానూ కట్టళ్ళు, నడవళ్ళుగా మనం పిలిచినా సమస్త వ్యవహారాలూ ఒకనాటి అసుర వివాహ లక్షణాలే