రష్యాలో వధువు వరుని పాదాలు ముద్దు పెట్టుకోవటమనే ఆచారం, ఆమె దాస్యభావాన్ని వ్యక్తం చేయటమే. అది ఫ్రాన్సు దేశంలో తరువాతి కాలాన భర్త కాళ్ళ దగ్గిర ఉంగరం పడేటట్లుగా చేసి దానిని వధువు వంగి తీసుకోవటమనే మార్పు పొందింది. రష్యాలో మహావిప్లవం వరకూ అసుర వివాహం బాహాటంగా సాగింది. వరుని తండ్రి వధువు తండ్రి దగ్గరికి వెళ్ళి బేరమాడి కోడలిని కొనుక్కొచ్చేవాడు. గేదె, గుర్రం, ఆవును బేరమాడటానికి, వధువుని తెచ్చుకోటానికి ఏ విధమైన విభేదమూ లేదు. వారు వివాహ యోగ్య ఐన కన్యను 'కుంక' అంటారట. 'కున' అంటే మార్టిన్ అనే జంతువు. పూర్వం దాని ధర్మానికి మారకంగా వివాహ యోగ్య ఐన కన్యక లభించటం వల్ల, నేడు కూడా యుక్త వయస్క అయిన కన్యకు ఆ పేరే నిలిచింది.
ఐర్లండు జాతులవారు శుల్కానికి 'కాయోబాచీ' అంటారట. దానికి వస్తుసముదాయమని అర్థం. అందులో బంగారము, రాగి, ఇత్తడి, గుడ్డలు, పందులు, ఆవులు అన్నీ ఉండవచ్చును. భార్యాపణ్యద్రవ్యాన్ని ఒక్కమాటుగా ఇవ్వవలసిన అగత్యం అన్ని జాతుల్లోనూ లేదు. వివాహం జరిగిపోయిన తరువాత కొన్ని సంవత్సరాలవరకూ ఇస్తూ ఉండవచ్చును.
సైబీరియాలో కిర్గిజ్ అనే టర్కిష్ జాతిలోని తండ్రి, కుమారుడికి పది ఏళ్ళు రాగానే ఒక పిల్లను సిద్ధం చేసుకొని ఎనభై పశువుల వరకూ ఉండే శుల్క ద్రవ్యాన్ని జాగ్రత్త చేయటం ప్రారంభిస్తాడు. ఇది అనేక పర్యాయాలుగా చెల్లించవచ్చు. ఎక్కువమొత్తం రాగానే పెళ్ళి జరుగుతుంది. ఈ జాతిలో శుల్కం అధికం. అందువల్ల ఎవరూ తొందరపడి భార్యకు విడాకులివ్వరు. ఇస్లాం మతధర్మం పురుషుని ఆధిక్యాన్నే నిరూపిస్తున్నా, స్త్రీని భర్త ఆస్తిగా పరిగణించటాన్ని ఏర్పరచినా, కావలసినంత మంది దొరక్క పోవటం వల్ల (Economic law of supply and demand) ఇటువంటి పని జరగదు అని శాస్త్రజ్ఞుల అభిప్రాయం.
ఆసుర వివాహ లక్షణమైన 'శుల్కం' పూర్తిగా చెల్లిస్తే గాని భార్య భర్త ఇంటికి రాక తల్లిదండ్రులతోనే ఉండటం అనేక జాతులలో ఉంది. పశ్చిమాఫ్రికాలో పూర్తిగా శుల్కం చెల్లించలేని భర్త మామగారింట్లోనే చెల్లించే వరకూ భార్యతో కాపురం చేస్తుంటాడు. అంతవరకూ కలిగే సంతానం మామగారి దౌతుంది. టెనింబరులో కన్యకకు శుల్క ద్రవ్యంగా ఏర్పరుచుకున్న దంతపు సామాను పిల్ల తండ్రికి చెందటానికి ఎంతోకాలం పడుతుంది. అంతవరకూ అతడు మామగారింట్లోనే ఉండిపోతాడు. ఆకికుయున్ జాతిలో ఇరవై గోవులకు భార్య లభిస్తుంది. అన్నీ ఒకమాటు చెల్లించక