కద్దు. హైరిపోజాతిలో పేదవాడికైనా ధనికుడికైనా భార్య ఒకేరీతిగా, ఒకే మారకానికి దొరుకుతుంది. కన్యక తండ్రికి ఒక బలిసిన ఎద్దును గానీ, లేదా ఒక మేకపోతును గానీ పంపిస్తే చాలు. దానిని వివాహ సమయంలో చంపి తినేస్తారు. ఇది ఒక్కటే వారి వివాహం తంతు. ఒక బండెడు చొప్పకు గానీ, ఒక బండెడు కట్టెలకు గానీ పేదవాడికీ, మూడువేల రూబుల్స్ శుల్కమిస్తేగానీ ధనికుడికీ, రష్యాలోని బాస్కర్ జాతివారిలో భార్య ఒకానొక కాలంలో లభించేది కాదని ఒక సాంఘిక శాస్త్రవేత్త వ్రాసి ఉన్నాడు.
సర్వసామాన్యంగా 'ఈ శుల్కం' అనేక విషయాలమీద ఆధారపడి ఉంటుంది. వధువు అందచందాలు, ఉభయుల ఆర్థికస్థితి, వరుడి వయస్సు, స్త్రీ పురుష జనసంఖ్య, మరికొన్ని స్థానిక కారణాలూ దీన్ని నిర్ణయిస్తూ ఉంటవి. కొన్ని సందర్భాలలో ఈ సందర్భాలతో అవసరం లేకుండా భార్యను పొందటానికి ఇంత శుల్కమని నిశ్చితమై కూడా ఉంటుంది. సర్వసామాన్యంగా విడాకులు పొందిన స్త్రీని గానీ, విధవ అయిన స్త్రీని గానీ తక్కువ వెలకు పొందవచ్చు. పుష్పవతి కాని పిల్లగానీ, బహుకాలం వివాహం కాని స్త్రీగానీ తక్కువకే దొరకవచ్చు.
చైనాలో అత్యుత్తమ నాగరిక జాతుల్లో ఈ నాటికీ ఆసుర వివాహం కనిపిస్తున్నది. శుల్కం చేత పడ్డంతవరకూ పెళ్ళి జరిగినట్టే కాదు, తంతు జరిగినా సరే. మొట్టమొదట మహమ్మదీయ దేశాలలో తండ్రికి 'కన్యాశుల్కం' ఇవ్వడం జరిగేది. అది క్రమంగా భర్త చనిపోయిన తరువాతగానీ, విడాకులు పొందినప్పుడు గానీ ఉపకరించే స్త్రీ ధనంగా పరిణమించింది. కొన్ని సందర్భాలలో ఇది వధువుకు బహుమతి మూలంగా చెందే ఏర్పాటు జరిగింది.
ఆసుర వివాహం స్త్రీలకు నైచ్యస్థితి ఏర్పడడానికి కారణంగా పరిణమించింది. వ్యక్తిత్వము గానీ, స్వేచ్ఛా స్వాతంత్య్రముగానీ లేని పశువుగా ఆమె పరిగణిత కావటం పురాతన సంఘాలలో ఆమె మారకానికి ఉపకరించే వస్తువైంది.
గ్రీసుదేశం అత్యుత్తమ నాగరికతను అనుభవిస్తూ ఉన్న కాలంలో, ఈ ఆసుర వివాహానికి సంబంధించిన ఒక వైవాహికాచారం ప్రబలంగా ఉన్నట్లు వారి సాహిత్యం వల్ల వ్యక్తమౌతున్నది. ఆమె క్రొత్త యింటికి అమ్ముడు పోవటం వల్ల ఆమెకు స్వాతంత్య్రం లేదు అని నిరూపించటానికి ఆమె ఎక్కివచ్చిన బండిని వరుని ఇంటి ముందు పురాతన గ్రీకులు పరశురామ ప్రీతి చేసేవారట. 'ప్రధానపుటుంగరము' అనేక జాతుల్లో ఈ శుల్కాన్ని చెల్లించటానికి గుర్తుగా భావిస్తారు. టుటానిక్ ఇంగ్లీషు జాతుల్లోనూ ఇదే లక్షణము.