Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆసుర వివాహము

కవిబ్రహ్మ తిక్కన సోమయాజి ఆనుశాసనిక పర్వంలో ధర్మరాజుకు గాంధర్వాది వివాహ విధానాలను చెప్పించే సందర్భంలో 'మున్ను మనంబున దనిసిన కన్నియ యెవ్వాని గోరు గాంధర్వం బా, యన్ను నతని కిచ్చుట, నెలవన్నుట యాసురము సూవే కౌరవముఖ్యా!' (ద్వి. ఆశ్వాసము. 233) అని ఆసుర వివాహ (marriage by purchase) లక్షణాన్ని వ్యక్తీకరించినాడు. కన్యకపోషకులు - తండ్రి కావచ్చును లేదా ఇతరులు కావచ్చును- ఆమెను ఒకానొక క్రయవస్తువుగా భావించి, వివాహార్థిగా వచ్చిన వరుని దగ్గరనుంచి గానీ, లేదా వాని బంధువుల దగ్గిరనుంచి గానీ కొంత ప్రతిఫలాన్ని పొందటము ఆసుర వివాహానికి ముఖ్యగుణము. ఇది భారతదేశంలో అనాది కాలం నుంచీ ఒక వైవాహిక విధానంగా ఉంటూ ఉన్నట్లు మన్వాదిస్మృతులవల్ల వ్యక్తమౌతూ ఉన్నది.

అనాగరకజాతుల్లో నేటికీ ఈ వివాహ విధానమే విశేషంగా కనిపిస్తున్నది. ఇది కేవలం రాక్షస వివాహం వలె (Marraige by Capture) అధమము కాదు దైవప్రాజాపత్యాలవలె ఉత్తమమూ కాదు. నాగరికతా పరిణామంలో మధ్యమస్థితి వహించిన నాళ్ళలో ఈ వివాహ విధానమే విరివిగా కనిపిస్తున్నది.

కొన్ని అనాగరకజాతుల్లో వివాహానికి వధువు బంధువర్గం దగ్గిరనుంచీ అంగీకారం ఊరికే దొరకదు. కన్యక తండ్రికి గానీ, ఇతర ఆత్మ బంధువులకు గానీ కొంత 'శుల్కం' ఇవ్వవలసి ఉంటుంది. అది కేవలమూ ఆస్తిపాస్తుల వల్లనే కాకపోవచ్చును. కొన్ని జాతుల్లో వివాహ యోగ్య అయిన కన్యక దొరకవలెనంటే, వరుడు ఆమె బంధువర్గానికి కొంతకాలం సేవ చేయవలసి ఉంటుంది; కొన్ని జాతుల్లో కన్యకు ప్రతిగా మరి ఒక కన్యకను ఇవ్వవలసి ఉంటుంది.

ఈ విధంగా ప్రతిఫలాన్ని ద్రవ్యరూపాన గానీ, మనుష్య రూపాన గానీ, లేక సేవామూలంగా గాని పొందితేగానీ, కన్యకను వివాహ యోగ్యుడైన వరుడికి ఇవ్వకపోవటము చాలా నికృష్టమైన ఆచారం. దీనిని స్త్రీలైనా ఎదుర్కోవటానికి యత్నం చెయ్యలేదు. పైగా వారు ఇటువంటి 'పణ్యద్రవ్యం' పుచ్చుకోవటం వల్ల వివాహానికి


266

వావిలాల సోమయాజులు సాహిత్యం-4