బలాత్కరించి తెచ్చి వివాహమాడిన స్త్రీ అతని పౌరుష పరాక్రమాలకు చిహ్నమనీ, అధిక గౌరవ వ్యాపకమైన పతాకమనీ అనాగరిక మానవుని భావన. రాక్షస వివాహం విశేష ప్రచారంలో ఉండే వైవాహిక విధానం కారణంగా, జాతిలోని కన్యకలను ఉత్తమ ప్రణయాదికాలవల్ల వివాహం చేసుకున్న వారికంటే, పరస్త్రీని బలాత్కరించి తెచ్చి దూషణానంతరం వివాహం చేసుకున్నవారు పరాక్రమోపేతులనే అభిప్రాయం ఆ జాతుల్లోని స్త్రీ పురుషుల్లో ప్రబలంగా ఉండటమూ, అందుమూలంగా అటువంటి వారికి విశేష గౌరవము సంఘంలో ప్రాప్తించటమూ జరుగుతూ వచ్చింది.
బేబరు ఆర్చి పెలగోలలో పక్కన ఉన్న గ్రామంలోని కన్యకను బలాత్కరించి పొందనివాడు స్త్రీతుల్యుడనే భావం నేటికీ కనిపిస్తున్నది. ఫిలిపైన్స్ ద్వీపాలలోని జాతుల్లో నేటివరకూ స్వజాతిలోని కన్యకలను వివాహ మాడటం తెలియదు. టిబెట్ ని పూరంగ్ జిల్లాలోనూ ఇదే నీతి. బలాత్కరించి కన్యకలను తీసుకోవచ్చి దూషణ క్రియ జరిపిన తరువాత ఆమెగానీ, ఆమె తల్లిదండ్రులుగానీ వివాహానికి అంగీకరింపకపోతే అతడు కులం పెద్దలను తీర్పు చెప్పవలసిందని విన్నవిస్తాడు. సర్వసామాన్యంగా వారు అవతలి జాతిమీద యుద్ధానికైనా సిద్ధపడి వివాహానికి సుముహూర్తం ఏర్పాటు చేస్తారు. ఈ కులంపెద్దల అంగీకారానంతరం విందులతోనూ, మదిరాపానంతోనూ వివాహం జరుగుతుంది. గోండు జాతిలోనూ ఇదే లక్షణం. న్యూ బ్రిటన్ లోని చీజికీ జాతివారు కన్యను అపహరిస్తారు; వారు దొరకని సమయంలో పరుని భార్యనైనా అపహరించి దూషణానంతరం వివాహం చేసుకోటానికి వెనుదీయరు.
రాక్షస వివాహం నేడు ఆచారంగా లేని జాతుల్లోని వైవాహికపు తంతును పరీక్షిస్తే ఆ జాతుల్లో పురాతన కాలంలో ఉండే యుద్ధాలను జయించటానికి తగిన ఆధారాలు లభిస్తున్నవి. బ్రిటిష్ న్యూ గయానాలోని రోరో తెగలో రాక్షస వివాహానికి ప్రత్యామ్నాయంగా ఒక తంతు కనిపిస్తున్నది. వధూవరుల ఉభయ బంధువర్గాలకూ కల్పితమైన ఒక చిన్న జగడం జరుగుతుంది. వధువు తల్లి ఒక కొయ్యతో కనబడ్డ ప్రతివస్తువు మీదా విరుచుకోపడి చివరకు రోదనం ప్రారంభిస్తుంది. దానితో ఊరిలో వర్గం అంతా చేరుతారు. ఈ విధంగా మూడుదినాలు దుఃఖిస్తుంది. అనంతరం కూడా ఆమె పెళ్ళి కుమార్తెతో ఇంటికి వెళ్ళటానికి నిరాకరిస్తుంది. ఇది పెళ్ళికుమార్తెను బలాత్కరించి ఎత్తుకోపోయారని నిరూపించటానికి ఏర్పాటైన వింత ఆచారం. మంగోలు జాతిలో వరుని పక్షం వాళ్ళు పెళ్ళికుమార్తె యింటిముందుకు వెళ్ళి లోపలకి పోనియ్యమని అడుగుతారు. ఆమె అన్న 'మా ఇంటితో మీకేమి పని?' అని
262
వావిలాల సోమయాజులు సాహిత్యం-4