పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రజస్వలానంతర వయసే వివాహ వయస్సు. బోధాయన సూత్రం కూడా (4-1-12-15) ఈ విషయాన్ని అంగీకరించింది.

మనువు (9-89-90) సద్వంశజుడు సద్యోన్యుడూ అయిన వరుడు లభించకపోతే కన్యక మృతివరకూ తండ్రి ఇంట్లోనే ఉండిపోవచ్చు అన్నాడు. ఇది ఒకవిధంగా నేటి పాశ్చాత్య విద్వాంసురాలు ఎలెన్కీ కోరిన మాతృత్వ రహితతావజ్ఞ (Exemption from Motherhood) అని చెప్పవచ్చును. ఈ పై అభిప్రాయాన్నే మహాభారతంలో వేదవ్యాసుడు అంగీకరించినాడు. (44-16)

మనువు తరువాత కాలక్రమాన కన్యక వివాహ వయస్సు తగ్గించడం జరిగింది. లౌషూక్షి గృహ్య సూత్రము ఆడపిల్లల బ్రహ్మచర్యము 10-12 సంవత్సరాలతో అంతమొందుతుంది అని చెప్పినది (19-2). వైఖానసస్మృతి బ్రాహ్మణుడిని నగ్నికను గానీ, గౌరిని గానీ వివాహమాడవలసిందని చెప్పి నగ్నిక వయస్సు 8 సంవత్సరాలనీ, గౌరి పుష్పవతికాని 10, 12 సంవత్సరముల కన్యక అని పలికింది. ఒక సూత్రంలో మృతి పర్యంతమూ వివాహమాడకుండా ఉండటానికి పైన చెప్పినట్లు మనువు అంగీకరించినా, మరొకచోట (9-94) 'ముప్పది సంవత్సరాలున్న యువకుడు అందమైన 12 సంవత్సరాల కన్యకను వివాహమాడవలసిం' దని శాసించాడు. ఆ సూత్రంలోనే పరంపరాగతాలైన వృత్తులూ, ధర్మాలూ నశించిపోతాయని తోచినప్పుడు, 24 సంవత్సరాల వయస్సున్న యువకుడు 8 సంవత్సరాల కన్యకను వివాహమాడ వచ్చునన్నాడు. పరాశర స్మృతిలో (ప్రకరణము 8) 8 ఏండ్ల కన్యక గౌరి అనీ, 9 ఏండ్ల కన్య రోహిణి అనీ, 10 ఏండ్ల కన్య రజస్వల అనీ చెప్పి ఉంది. 12 ఏండ్లు వచ్చిన తరువాత కన్యాదానం చెయ్యకపోతే ఆమె రజస్సును పితృదేవతలు పానం చేస్తారట, ఆమె తల్లిదండ్రులూ, జ్యేష్ఠభ్రాతలూ నరకాన్ని పొందుతారట. యమపరాశరాది గ్రంథాలు రజస్వలానంతర వివాహాన్ని పాపకృత్యంగా పరిగణించినవి. క్రమక్రమంగా 'అష్టవర్షా ద్భవేత్ కన్యా' అనే ఆర్యోక్తి ఏర్పడ్డది. బాల్యవివాహాలు ప్రబలినవి.

రామాయణంలో (అరణ్య కాండ 47-10-11) వివాహ సమయానికి సీతారాములకు వయస్సు 6, 16 సంవత్సరాలు, కానీ కౌటిల్యుని అర్థ శాస్త్రంలో క్షత్రియకన్యకు 16వ ఏట వివాహం చెయ్యటం యుక్తమని కనిపిస్తున్నది.

వైద్యశాస్త్రజ్ఞుడు సుశ్రుతాచార్యులు 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత యువకుడికీ, 12 ఏండ్లు వచ్చిన తరువాత బాలికకూ వివాహం చేయమన్నాడు. వాగ్భటుడు యువకుని


[[rh|254||వావిలాల సోమయాజులు సాహిత్యం-4}}