పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సంవత్సరాలు గడవనిచ్చారు. ఇటలీలోనూ, హాలండు, గ్రీసు, ఇంగ్లండు, ఫ్రాన్సు దేశాలలో 21వ వత్సరంగా, స్త్రీ పురుష విభేదం లేకుండా వ్యక్తిత్వ వయో నిర్ణయం (Determing the age of Majority) జర్మనీలో 20 గానూ, స్పెయిను 23, ఆస్ట్రియా 24 గానూ పరిగణిస్తున్నవి. కానీ ఈ వయో నిర్ణయము న్యాయశాస్త్రానికి మాత్రమే వర్తిస్తుంది. సామాన్య వ్యక్తిత్వము (Puberty) స్త్రీలకే ముందు ప్రారంభమయ్యేటట్లు అందరూ అంగీకరిస్తారు. ప్రపంచంలోని వివిధ దేశాలలోనూ ఈ శతాబ్దారంభదశలో ఈ కిందివిధంగా వైవాహిక వయో నిర్ణయం జరిగినట్లు తెలుస్తున్నది.

దేశము పురుషుడు స్త్రీ
ఫ్రాంసు 18 15
జర్మనీ 20 16
ఆస్ట్రియా 25 24
స్పెయిన్ 18 16
గ్రీసు 16 14
హాలండు 18 16
ఇటలీ 18 15
డెన్మార్కు 20 16

అయితే తల్లిదండ్రుల (ఉభయ పక్షాలలోనూ) అంగీకారముంటే బాలబాలికలు 14వ సంవత్సరంలో వివాహం చేసుకోవచ్చునని ఆస్ట్రియా దేశంలో అభిప్రాయంగా ఉండేది.

భారతదేశంలో వైవాహిక వయో నిర్ణయం చిత్రాతిచిత్రమైన మార్గాలను అనుసరించుచున్నట్లు కనిపిస్తుంది. మొదట రజస్వలానంతర వివాహాలు ఉన్నట్లే కనుపించినా తరువాత తరువాత కన్యా వివాహాలు ప్రబలినవని చెప్పవలసి వస్తున్నది. అవి వర్ణవ్యవస్థ ననుసరించి అంతర్విభేదాలతో కూడా ఉన్నట్లు అర్థమౌతుంది. 'దేశప్రవృత్తి సాత్మాద్వా బ్రహ్మ ప్రాజాప త్యార్ష దైవానా మన్యతమేన వివాహేన శాస్త్రతః పరిణయే దితి వరణవిధానమ్' (2-1-21) అన్న వాత్స్యాయన మహర్షి సూత్రాన్నిబట్టి చూస్తే, భారతదేశంలో క్రీ.శ. 4వ శతాబ్ది మధ్యభాగం నాటికే, అంతకు పూర్వం కొంతకాలం నుంచి కూడా అష్టవిధ వివాహాలు జరుగుతున్నట్లు తెలుస్తున్నది. కొందరు కన్యనూ, కొందరు గాంధర్వ విధానాన యువతిని వివాహ మాడినట్లు విస్పష్టము. కామతంత్రానికి ఏకైక శాస్త్రకారుడు వాత్స్యాయనుడు కన్యా సంప్రయుక్తంలో ____________________________________________________________________________________________________

252

వావిలాల సోమయాజులు సాహిత్యం-4