Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రమవారిలేశముల నించుక సముచ్ఛ్వాసిత పత్రలేఖలు గలిగి పుష్పాసవాఘూర్ణిత నేత్రశోభియగు ప్రియాముఖమును జుంబించుచున్నాఁడు. నిండు పూగుత్తులే పాలిండ్లుగఁ జిత్తమును హరించుచున్న తీఁగబోటులవలన తరువరులు వినమ్రశాఖా భుజబంధనముల నొందినవారగుచున్నారు. 21[1]"మురారి మహాకవి యస్తమించు సూర్యకిరణములనే యొకటి, రెండు, మూఁడు, నాలుఁగని లెక్కించుచుఁ దన కమలదళముల ముడిచెనో మఱల నుదయించు నట్టి యా కిరణములనే యుదయవేళ కమలలత సంతోషముతోఁ దిరిగి లెక్కించుచుఁ గ్రమముగాఁ దనదళములను విప్పు మనోజ్ఞ దృశ్యమును దర్శించినాడు.

మ. 22[2] "తనకుం గౌఁగిలి యీ వొకప్పుడును నాథా! నీ కరస్పర్శనం
    బున గిల్గింతలె యంచుఁ బద్మిని కరాంభోజంబునన్ మందమం
    దనటద్వాయుచలద్దళాంగుళులు గన్పట్టంగ నవ్వెల్గురా
    యని రారా యనిపిల్చె నాఁదగు ద్విరే పాద్యంతదీర్ఘధ్వనుల్.”

చేమకూర కవిరాజు వీనులొగ్గి విని యానందించినాఁడు. 'నానాసూనవితాన వాసనల నానందించు సారంగ మేలా నన్నొల్లదటంచుఁ దీవ్రతపమొనర్చి గిరికాదేవి నాసికయై ప్రేక్షణ మాలికా మధుకరీపుంజముల నిర్వంకలం బూనిన' గంధఫలిని భట్టుమూర్తి కన్నులారఁ గాంచి తనివినొందినాఁడు. [3]23కవయిత్రి విజ్జికాదేవి యుదయ సంధ్యాదేవి నర్చించుటకై ప్రాక్సముద్రమున స్నానమాడి నభోద్రుమ శాఖికలం దున్న నక్షత్రపుష్పములఁ గోయ నంశుమాలి యసంఖ్యాకము లైన కరములఁ జూచు రమణీయదృశ్యమును జూచినది.

[4] 24చక్షుర్గోచర మగు పుష్పము సాధకుని దృష్టియందు హృదయపుష్పమునకు బాహ్యచిహ్నము. అది శుద్ధపుష్పము కాదు. విశ్వేశ్వరుని ప్రాణకళిక! అనంతుని లీలారూపము!! ఇట్టి పుష్పరూపమున మునిఁగి తన్మయత్వముతోఁ జూచి సాధకుఁడు దానిని ధ్యానధారణలకు లక్ష్యముగ నొనర్చుకొనుచున్నాఁడు. అట్టి స్థితి యందుఁ బుష్పము వలనఁ గలిగిన రసానుభవము సాధన కాలంబమగుటయే కాక మూర్తిమంతమగును. అందుఁ బ్రాణసాక్షాత్కారమగును. పుష్పము చిద్రూపమున ననంతమై యనంతమగు ప్రాణవాహినియందు దివ్యసౌరభముతో వికసించు చున్నది. సాధకుని ప్రాణమునకు నా పుష్పమునకు జరుగు నాదానప్రదానమే రాసలీల!

రూపాంతరము!!'

  1. మురారి : అనర్ఘ రాఘవకర్త (క్రీ.శ. 790-840) ఈ భావమునకు మూలము "ఏక ద్వి త్రి చతుః క్రమేణ గణనా మేషామివాస్తం యతాం కుర్వాణా సుమకోచయద్దశశతా న్యంభోజ సంవర్తికాః భూయోశ క్రమశః ప్రసారయతీతా స్సం ప్రత్య మానుద్యత స్సంఖ్యాతుం సకుతూహ లేవ నళినీ భానో స్సహస్రం కరాన్"
  2. తనకుం గౌఁగిలి - విజయవిలాసము ఆ. 1, ప. 130 చేమకూర తంజావూరు
    రఘునాథరాయల యాస్థానకవి నానాసూన - వసుచరిత్ర ఆ. 2, ప. 47
  3. విజ్జికాదేవి - క్రీ.శ. 6, 7 శతాబ్దుల మధ్యకాలము. కౌముదీమహోత్సవ నాటకకర్త్రి - ఇందలి భాగమునకు మూలము : దీర్ఘ దిగంతవిటపేషు కరైరసంఖ్యై నక్షత్ర పుష్పతరణేషు నభోద్రుమస్య, స్నాతో స్థితో జలనిధేరయ మంశుమాలీ, సంధ్యార్చనాయ కుసుమాపచయం కరోతి.
  4. చక్షుర్గోచరమగు పుష్పము: సమీక్ష - శ్రీ ముట్నూరి కృష్ణరావు పుట 84

____________________________________________________________________________________________________

మణిప్రవాళము

25