పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పుష్పలోకము హితవాక్యములఁ బలికినది. నీచపు దాస్యవృత్తి మనలేక దేశము స్వాతంత్య్రజైత్రయాత్రల సాగించు సమయమున -

ఉ. 19[1]ఈ సుమజన్మ మెట్లు ఘటియిల్లెనొ నా కొకనాఁటి పాటిదై
    వాసనలీను సోయగము వాయని తీయని పోడుముల్ క్షణం
    బో సగమో విచారపడఁబో నయినన్ విడివడ్డ నా యెద
    న్మోసులువారు నూతనమనోరథ మామని వేడిపొంగులన్.’

అని పుష్పలోకప్రతీకయైన యొక సుమము నిజకాంక్ష నిట్లు వెల్లడించినది. "ఓ వనమాలీ! పేదల రక్తమాంసములఁ బెంపు వహించి దయారసామృతాస్వాద దరిద్రులైన ధనవంతుల పెద్దఱికమ్ము కై మతోన్మాదము పెంచు దేవునికి మాఱుగ నిల్పిన రాతిబొమ్మలం దూదరనోవు జన్మ మిఁక యొక్క నిమేషముసైప నాయెదన్. లలనాజనతా కబరీభరైకభూషాకలనలందుఁ దల్పోపగూహబిబ్బోకములందును నాకుఁ దలంపు లేదు. చక్రవర్తుల శవపేటికలఁ జీరనిద్రనొందుఁ చిత్తము లేదు. నన్నుఁ ద్రుంచి మాతృసేవాచరణమ్ములం దసువు లర్పణఁ జేసెడివారి పార్థివశ్రీ చెలువారుచోటఁ బడవేయుము. వారి యుదాత్త సమాధి మృత్తికలో వాసనలీనుచు రాలిపోయెదను.”

పుష్పలోకమునఁ బ్రవేశించిన మహాకవులకు మహనీయ దర్శనభాగ్యములు లభించినవి. ఆదికవి వాల్మీకి పుష్పతరువుల నొక మాఱుష్ణీషధారుల వలెను, మఱియొకమాఱు పీతాంబరధారులవలెను దర్శించినాఁడు. శివతపోభంగ కార్యనిర్వహణార్థమై సుమసాయకదేవుఁడు త్రిలోకాధిపతియగు నింద్రుని కడ తాంబూల మందుకొని రతీద్వితీయుఁడై వాసంత విలాసశ్రీ వహించిన తపోవనమునఁ బ్రవేశించునేళ మహాకవి కాళిదాసునకుఁ బుష్పలోకము ప్రియదర్శన మొసఁగినది.

20[2]లగ్నద్విరేఫాంజన భక్తికిమ్మీరిత తిలకముఖియై మధుశ్రీ బాలారుణకోమల లాక్షారసముచేఁ జూతప్రవాళోష్ఠము నలంకరించుచున్నది. ప్రియాళుద్రుమమంజరీరజః కణములు విశాలనేత్రములఁ బడుటచే దృష్టిపాతమునకు విఘ్న మాపాదింప మృగములు మదోద్ధతిచే మర్మరపత్రమోక్షములైన వనస్థలములఁ బర్వు లెత్తుచున్నవి. చూతాంకురాస్వాద కషాయకంఠమగు పుంస్కోకిలాకూజితము మనస్వినీమాన విఘాతదక్షమై యొప్పుచున్నది. వర్ణప్రకర్షనే కాని బ్రహ్మ తనకుఁ దావి నీయలేదని కర్ణికారము నొచ్చుకొనుచున్నది. మధుద్విరేఫరాజు కుసుమైక పాత్రలోఁ బ్రియాను

వర్తమానుఁడై యాస్వాదించుచున్నాఁడు. గీతాంతర వేళఁ గిన్నరుఁ డొకఁడు

  1. ఈ సుమజన్మ - శ్రీ వేదుల 'కాంక్ష' నుండి
  2. లగ్నద్విరేఫ - కాళిదాసు కుమారసం. సర్గ. 3, శ్లో. 30-54.

____________________________________________________________________________________________________

24

వావిలాల సోమయాజులు సాహిత్యం-4