పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సమితి వివాహము (Club - marriage) అని అనవచ్చును. ఇది గుంపు పెళ్ళిలోనే ఒకవిధమైనదని అతని అభిప్రాయము.

బహుభర్తృత్వవిధానంలో పురుషులందరూ బహుభార్యాత్వాన్ని - అంటే బహు గామిత్వాన్ని (Polygamy) పొందుతారు. స్త్రీలు బహుభర్తృత్వాన్ని అంటే బహుగామిత్వాన్ని (Polyandry) వహిస్తారు. బహుభర్తృత్వవిధానం ముఖ్యంగా మాతృస్వామిక (Matriarchical Family System) సంఘ నిబంధనల వల్ల కలిగి ఉంటుందని ఊహించటంలో విప్రతిపత్తి అణుమాత్రమూ లేదు.


ప్రపంచ వివాహ చరిత్రకారుడు వెస్టర్ మార్కు మహాశయుడు ఈ వైవాహిక విధానాన్ని గురించి ఇలా వ్రాసినాడు :


‘బహుభర్తృత్వ బహుభార్యాత్వాలనే రెండు తెగలకు చెందిన వైవాహిక విధానాలనూ రూపుమాపవలెనంటే, బహుభర్తృత్వాన్ని కోరే స్త్రీల దగ్గిర భర్తలను తీసుకోవచ్చి బహుభార్యాత్వం కోరే పురుషుల దగ్గిర ఉన్న స్త్రీలకు వివాహం చేస్తే సరిపోతుందేమో కానీ అది అసంభవము. ఆయా జాతుల స్త్రీ పురుషుల సంఘాలపై ఆధారపడి ఉంటుంది. ఒక జాతిలో స్త్రీలు తక్కువగా ఉండి, పురుషులు ఎక్కువ ఉండటం వల్ల ఈ వివాహం అమలులోకి వచ్చి అటువంటి పరిస్థితులలో ఇటువంటి వ్యవస్థను సంఘం అంగీకరింపలేకపోయింది.'


ఈ వివాహ విధానానికి ఆర్థికావసరాలు కూడా మరో కారణం. దేశంలో ఆస్తిపాస్తులు స్త్రీల పరమైనప్పుడు ఏ స్త్రీ దగ్గర ఆస్తి ఎక్కువగా ఉంటుందో ఆమెను, ఆమె ధనాన్ని అనుభవించ వచ్చుననే కారణంతో ఎక్కువమంది పురుషులు ఏకకాలంలో వివాహమాడటం మూలంగా కూడా, ఇటువంటి విధానం ఆచరణలోకి వచ్చి ఉండవచ్చును.


బహుభర్తృత్వం ఒక విధమైన సంతాన నిరోధక మార్గము. ఒక స్త్రీకి అనేకమంది భర్తలున్నప్పుడు ఒక భర్త వల్లనే విశేష సంతానం కలుగదు. ఇందు మూలంగా ఆస్తిపాస్తుల విభజన కూడా 'సాముదాయిక జీవనం' చేయడానికి అవకాశమున్నది.


కొన్ని కొన్ని జాతుల్లో భార్యకు చెల్లించటానికి కావలసిన కన్యాశుల్కం (Bride Price) సంపాదించుకునే అవకాశం లేకపోవటం వల్లనూ బహుభర్తృత్వం అవలంబించి ఉండే అవకాశమున్నదని వెస్టర్ అభిప్రాయము.


సంస్కృతి

205