అందరియెడా సర్వసామాన్యంగా ఉన్న గాంధర్వ వివాహ పద్ధతి కేవలమూ క్షత్రియుల విషయంలోనే ఆచారమై నిలచింది. మిగిలిన జాతులన్నిటికీ ప్రాజాపత్యమే ధర్మబద్ధమైన వివాహమైనది. ప్రస్తుతపు హిందూ వివాహ ధర్మం అది ఒక్కటే.
కన్యావివాహాలు కేవలం బ్రాహ్మణజాతికి మాత్రమే సంబంధించిన వేమో
ననిపిస్తుంది. ఇందులో కన్యకకంటే వరుని వయస్సు మూడు రెట్లు అధికంగా
వుండాలనే నియమం ఉన్నది. ఇది వారి విద్యావిధానం మీదా ఇతర కారణాల మీదా
ఆధారపడి ఉంటుంది.
భార్యాభర్తల మధ్య అంతరాన్ని గురించి హిందూ వైద్యశాస్త్రజ్ఞులు ఏం
పలుకుతున్నారో ఈ సందర్భంలో గమనించవలసి ఉంటుంది. సుశ్రుతుడు ఇరువది
ఐదేండ్ల పురుషుడు పన్నెండేళ్ళ కన్యకను వివాహం చేసుకోవాలన్నాడు. వాగ్భటుడు
పురుషుని వివాహ వయస్సును ఇరువది ఒక్క సంవత్సరానికి తగ్గించినాడు.
అంతేకాకుండా పదునైదు, పదహారు సంవత్సరాలకు పూర్వమే స్త్రీకి గర్భధారణం
జరిగితే పిల్లలు అతిబలహీనంగా ఉండటమో, మరణించటమో జరుగుతుందని సుశ్రు
తుని అభిప్రాయము. అంతేకాకుండా వెనుకటి హిందూజాతి కన్యకలు పుష్పవతులయ్యే
వయస్సు ఈ నాటికంటే మించి ఉండి ఉంటుందని శాస్త్రజ్ఞులు అభిప్రాయపడినారు.
ఆ నాడు కన్యావివాహాలని చెప్పినవన్నీ గృహస్థ ధర్మాన్ని నెరపే వివాహాలు
కాకపోవచ్చును. కావు కూడాను.
యువకుల వివాహ వయస్సును ప్రాచీన హిందువులు ఎందుకు పెంచవలసి
వచ్చింది? భార్యాభర్తల మధ్య ఉండే అంతరం మూలంగా బలకరమై పూర్ణాయుర్దాయాన్ని
పొందే సంతానం కలుగుతుందనే నమ్మకం మీదనా? లేక, స్త్రీ కంటే పురుషునిలో
ఏదో ఆధిక్యము ఉన్నదనే నమ్మకం మీదనా?
సుశ్రుతాచార్యుని అనుసరించి స్త్రీలలో ఋతుధర్మం పన్నెండవ ఏట ప్రారంభించి
ఏబదియవ సంవత్సరం వరకూ ఉంటుంది. పదునైదవ సంవత్సరము మొదలు వారు
దరిదాపు నలువది ఐదు సంవత్సరాలవరకూ సంతానాన్ని పొందటానికి శక్తిగలవారుగా
ఉంటారు. అందువల్ల యువకుడు ముప్పదియవ ఏటా, స్త్రీ పన్నెండవ ఏటా వివాహం
చేసుకుటే ఇరువురికీ క్రమమైన సత్సంతానం కలుగుతుందని ప్రాచీన హైందవులు
నమ్మి ఉంటారు. అంతవరకూ సంతానానికి మూలకారణుడైన పురుషుడు
అంతర్ముఖమైన సృజనాశక్తితో బ్రహ్మచర్యాన్ని అవలంబిస్తాడు.
196
వావిలాల సోమయాజులు సాహిత్యం-4