పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొన్ని శారీరక విపత్తులు గూడా ఏర్పడి ఉంటవి. ఆ పద్ధతిని మరింతకాలం అమలులో ఉంచితే వర్ణాలలో విశేషంగా వంధ్యత్వము (Sterility) ప్రబలిపోతుంది. అలా జరిగితే సంతాన రహితత కలుగుతుందనే అభిప్రాయాన్ని నేటి సంతాన శాస్త్రజ్ఞులు అంగీకరిస్తూ ఉన్నారు.


ఈ సందర్భంలో ఒక శాస్త్రవేత్త ఏమంటున్నాడో గమనించండి. 'యూరప్ దేశంలో కూడాను ఉత్తమ శ్రేణికి చెందిన వారిలో కంటే తక్కువవారిలోనే సంతానాభివృద్ధి ఎక్కువ. అందువల్ల లోకంలో ఎప్పుడు పుట్టినా మొత్తం మీద చూస్తే యోగ్యమైన సంతానం కంటే అయోగ్యమైన సంతానమే విశేషంగా కలుగుతుంది' అన్నాడు ఆయన. ప్రాచీన హైందవ సామాజిక స్థితి వర్ణభేదం మీద ఆధారపడిన మాట వాస్తవము. దాని కారణం నేటి సంతాన శాస్త్రజ్ఞులు పలుకుతూ ఉన్న అభిప్రాయాలకు మూలమైన విజ్ఞానమే. మిశ్రమ సంతానం వల్ల ప్రయోజనం లేదని వారు గ్రహించారు. అందువలన ప్రత్యేక వైవాహిక నియమాలను అనుశాసించారు. మెండల్ మహాశయుడు 'లోకం చెప్పుకునే వర్ణాంతర వివాహాలకూ, జాత్యంతర వివాహాలకూ తగిన ప్రకృతి మూలం లేదని అభిప్రాయ పడుతున్నాడు.,


అయితే కులతత్త్వం విపరీత మార్గాలను పట్టి, చాలా సంకుచిత దృష్టి కాలక్రమేణా వహించిన దన్నమాట అందరూ అంగీకరించి తీరవలసినదే. అందుమూలంగా కూడా వివాహానికి ప్రధానాశయమైన 'సత్సంతానానికి' ఎంతో దెబ్బ తగిలిన మాటా వాస్తవము.


హిందూ వైవాహిక ధర్మంలో యోగ్యమైన కన్యకను మాత్రమే వివాహం చేసుకోమనేది మంచి నియమం. ఈ విషయాన్ని ప్రతి జాతీ పాటిస్తుంది.


వేదయుగం అంటూ ఒకటి చారిత్రక సత్యమైనట్లయితే ఆ కాలంలో వివాహం బాగా యుక్తవయస్సులోనే జరిగినట్లు నిదర్శనాలున్నవి. వారి వారి మానసిక వికాసాలను అనుసరించి ఒకరినొకరు అన్యోన్యం ప్రేమించుకొని వివాహం చేసుకున్నారు. కాని తరువాతి కాలంలో మార్పు వచ్చింది. భర్తకంటే భార్య మూడు వత్సరాలకంటే చిన్నదై ఉండరాదని వాత్స్యాయనాదులు చెప్పినారు. సంతాన శాస్త్రజ్ఞులూ (Eugenists), మానసిక తత్త్వవేత్తలూ (Psychologists) ఇద్దరు కామోద్రేకులూ (Sexual Neurotics), అసామాన్య కామమార్గావలంబులూ (Abnormal Sexes) అయినవారి మధ్య జరిగే వివాహాలలో సంతానం చాలా దెబ్బతింటుందని అభిప్రాయమిస్తున్నారు. అందుమూలంగానే అనాదికాలంలో


సంస్కృతి

195