Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అయితే ఏ వర్ణం వారైనా వారి వారి గోత్రంలో నుంచి కన్యకలను వివాహం చేసుకోకూడదనే నిర్ణయించినారు. అంటే ఆర్యవివాహంలో ఒక విధమైన కూటాంతరత (Exogamy), కూటబాహ్యత (Endogamy) రెండూ ఉన్నవన్నమాట!


ఉత్తమ జాతులు (వర్ణాలు) అనిపించుకున్నవారు అనులోమ వివాహపద్ధతి మూలంగా తక్కువ వర్ణాలవారిని వివాహం చేసుకోవచ్చుననే నియమం ఆచారంలోకి వచ్చినది. ఎక్కువ జాతికి చెందిన తండ్రికి కలిగిన కుమాళ్ళు ప్రాచీనకాలంలో ఎక్కువ జాతివారై తదనుగుణమైన జననాదికసంస్కారాలను పొందేవారు. కానీ తక్కువజాతి తండ్రికి పుట్టినవాడు మాత్రము తల్లిజాతికి రావటానికి వీలులేదు. దీనిని ఆధారం చేసుకునే మనుధర్మశాస్త్రంలో అనులోమ విలోమ జాతి నిర్ణయం జరిగింది. వర్ణధర్మానికి మూలసూత్రం కులక్రమాగతశక్తి (Heredity). దానిని నిలపటానికే హిందూ ధర్మశాస్త్రజ్ఞులు ప్రయత్నించారు.


అయితే - భార్య ఎప్పుడూ తండ్రివైపు ఏడు తరాలలోనూ, తల్లివైపు 5 తరాల లోనూ ఉండకూడదు. ఈ నియమమూ కాలాన్ని బట్టి, స్థలాన్ని బట్టి, సందర్భాలను బట్టీ మార్పు పొందినట్లు కూడా నిదర్శనాలు లేకపోలేదు. తండ్రివంశములో నుంచి వివాహం చేసుకోవటమనే ఆచారం క్రమక్రమంగా నశించి నిర్మూలితమై ఉంటుంది. హిందూ సంఘానికి చతుర్వర్ణాలు ప్రథమ విభాగం. అందులో ప్రతివర్ణములోను కొన్ని అవాంతర భేదాలు. ప్రతి అవాంతర జాతిలోనూ గోత్రవిభాగం ఏర్పడ్డది. ఇందులో కొన్ని వర్ణాల వారికి మొదట గోత్రాలు లేకపోయినా లేకపోవటానికి కారణం అనాదినుంచీ ఆర్యులు కాకపోవటమేమో - తరువాత పురోహిత గోత్రాలను స్వీకరించి నారు. అందువల్ల అలా ఏర్పడ్డ వంశాలలోనూ పూర్వం ఒకవేళ అవకాశం ఉన్నా తరువాతి కాలంలో పితృపక్షం నుంచి భార్యను స్వీకరించే అవకాశం తప్పిపోయింది.

- వెనుకటి కాలాన్ని గానీ, సాంఘిక స్థితిగతులను గానీ నేటి దృక్పథంతో విచారించడము శాస్త్ర సమ్మతము కాదు. ఆర్యజాతిలో విశిష్ట మేధాసంపన్నులు జన్మించి, జాతి విశిష్ట ధర్మాలకు దెబ్బ తగలని రీతిగా కొన్ని కట్టుబాట్లు ఆలోచించి, స్మృతులమూలంగా నిబద్ధం చేశారు. మొదట్లో వర్ణాంతర వివాహాలు కొన్ని విరివిగా జరిగి ఉండి ఉంటవి. వర్ణాంతర వివాహమంటే సంతనా శాస్త్ర రీత్యా పలికితే కృతక - సంతాన ప్రాప్తి (Inter - Breeding) అని చెప్పవచ్చును. లేదా, మిశ్రమ - సంతాన ప్రాప్తి వల్ల ఆర్యులకు కొన్ని దోషాలు పొడకట్టినట్లు అవగతమౌతూ ఉన్నది. ఆయా వర్ణాలలోనూ, వంశాలలోనూ కనుపట్టవలసిన పావిత్య్రయము మాట అటు ఉంచినా,


194

వావిలాల సోమయాజులు సాహిత్యం-4