పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/19

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డదిసీ. 'దీప్తిమాధుర్యావధిశిరస్సుధాంశుభా
             స్వన్మనోహర విలాసమ్ములగుచు
     క్లిష్టబంధవిచిత్ర కేళీప్రశస్తిర
             హఃకళాపూర్ణోదయము లగుచు
     కృష్ణపదాగ్రభక్తి సుగృహితాముక్త
             మాల్యదాచ్ఛ ప్రౌఢమధువు లగుచు
     ననితరలభ్యవర్ణాత్తశయ్యాహేతు
             వై పాండురంగమహత్తు లగుచుఁ

తే. దీయఁదనములు మెఱుఁగులుఁ దెచ్చుకొన్న
   ప్రియలు ప్రియులు కూడి మనుచరిత్ర లగుచుఁ
   దెలుఁగు రసికలోకముల కందిచ్చె నసువు
   లత్తుకొని మల్లెపూల్ క్రొత్త క్రొత్తరుచులు.'

సాధకుని శక్తిసామర్థ్యముల ననుసరించి వసంతమల్లికామతల్లికల లీలా విలాసములు ద్యోతకములగుట నిస్సంశయము.

‘బ్రహ్మ విష్ణు మహేశ్వరులఁ దమ హరిణేక్షణలకు గృహకుంభదాసులఁ గావించి వర్ణనాసీమ నతకరించు చరిత్రచే విచిత్రితుఁడైన కుసుమాయుధునకు నమస్కరింతు' నని మహానుభావుఁడగు నొక కవివతంసుఁడు కావ్యారంభ మొనర్చి యున్నాఁడు. ఇట్టి మహత్తరశక్తి యా మదనునకుఁ బుష్పసాయకుఁ డగుటచే నబ్బిన దనుట యతిశయోక్తి కాదు.

పుష్పముల కింతటి ప్రౌఢప్రభావము కలదని యంగీకరించుటకు బుద్ధివోని [1]శంకర పూజ్యపాదులవంటి శివోపాసకులు "తల్లీ! పుష్పధన్వియు, మధుకర మౌర్వియు, మలయమరుదా యోధనరథియు, వసంత సామంతుఁడునైన యనంగుఁడు త్వదీయాపాంగావలోకనశ్రీ వహించి యెక్కటివీరుఁడై జైత్రయాత్ర సాగించుచున్నాఁ' డని సమస్తకీర్తి నా సౌందర్యలహరీ కటాక్ష వీక్షణములకుఁ గట్టిపెట్టిరి.

కవికుల గురువు కాళిదాసు పరమేశ్వర సాన్నిధ్యమున కా యగధర రాజపుత్రికను [2]నిర్భర్త్సిత పద్మరాగాశోక పుష్పగను నాకృష్ణ హేమద్యుతి కర్ణికారగను, ముక్తాకలాపీకృత సింధువారగను నలంకరించి లేఁబ్రొద్దు వన్నెగల వలిపమును ధరింపఁజేసి పూగుత్తులచే

వంగిన జంగమలతవలెఁ గొనివచ్చి యుచితజ్ఞుఁడై పుష్ప ప్రాభవమును గాపాడినాఁడు.

  1. శంకరపూజ్యపాదులు : అద్వైతమతస్థాపనాచార్యుఁడైన యాదిశంకరుఁడు
  2. నిర్భిర్త్సిత - కాళిదాసు కుమార, సం. 3, శ్లో. 53

________________________________________________________________________________________

మణిప్రవాళము

19