పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అంతటితోఁ దనివినొందక సారెసారెకు స్రస్తమగుచు స్మరకార్ముక మౌర్వీద్వితయమో యన నొప్పు కేసర దామకాంచిక నామె కవలంబమాన మొనర్చి నాఁడు.

ఒక యువకవి గులాబీలకుఁ గోమలకంఠ మొసఁగలేదని పరమేష్ఠిని నిందించుటకుఁ బాల్పడినాఁడు. కాని మఱియొక సరస సాహిత్యప్రియంభావుకుఁడు [1]"ప్రౌఢ భావప్రపూర్ణలౌ నో పుష్పకన్యలారా! మీరు పిలువనైన నెఱుఁగని ప్రవక్తలు; నిత్య నిర్మలానందమును బ్రసాదించు నమృతచషకము' లని యుజ్జ్వలముగ నూహించి నాఁడు, [2]"వినఁబడెడు సంగీతము మధురమైనది; వినఁబడని సంగీతము మధురాతి మధురమైనది.’ ఆమంత్రణము లేకయే యమలిన భావములఁ బంచి పెట్టుచుఁ గుసుమములు కోమల కలస్వనములు వినిపింపఁగలవు. రసగుంఫిత కావ్యాలాపముల రసిక హృదయముల దోఁచుకొనగలవు. 'కాశపుష్పమొండు కదలిన కన్నీటి జడులకుఁ గారణభూతములగు గంభీరభావములు నాలో స్పందించు' నని యొక యాంగ్లమహాకవి ప్రవచనము. ఐన నా ప్రసవభాషల, సుమగీతముల నవగతమొనర్చుకొని, యాహ్లాదించుటకు గుసుమసుకుమార హృదయముండ వలెనన్నమాట!

ప్రాచ్యులకు బ్రసవకులముపైఁ బ్రణయము. వారికిఁ బూలతో వియ్యములు; పూలతోఁ గయ్యములు, వారు కుసుమ హృదయ మెఱుఁగుదురు; సుమసృష్టి రహస్య మెఱుఁగుదురు. ప్రాచ్యుఁడైన యొక 'త్సిన్' చక్రవర్తి ప్రమదవనమునందలి ప్రసవలతలు విహంగదంపతుల విశృంఖలవిహారములకు గుఱి కాకుండుటకై కాంశ్యకింకిణులఁ గట్టించియు, ఋతుసమయముల నాస్థానగాయకులచే మనోజ్ఞ రాగాలాపముల విన్పించియు నానందాబ్ధి నోలలాడినాఁడు. బౌద్ధధర్మావలంబి మఱియొక 'త్సిన్' సార్వభౌముని కరుణాహృదయము పుష్పలోకము నుద్దేశించి : "కొనగోఁట గిల్లఁ గన్నీటఁ దడిసిన మిమ్ము తథాగతులకుఁ గాన్క యొసఁగలే నో లలితలతాంతములారా! నా కొఱకి ట్లీ లతల లీలావిలాసములతో నిల్చి భూత భవిష్యద్వర్తమాన బుద్ధులను జేరుకొనుఁ" డని యర్థించినాఁడు. అహో! ఎట్టి హృదయార్ద్రత! ఎంత రసికత!!

పుష్పములతోఁ బుట్టినది పుణ్యభూమి భరతావని. అందు ప్రమాదవనములు లేని ప్రాచీన పట్టణమే లేదు.

మ. [3]"పరిపూఁదోఁటల తావి మి న్నలమ వేల్పుల్ మెచ్చి తద్భూజభా
    స్వరసంతానములన్ దివిం బెనుప నా సంతానముల్ దివ్యని
    ర్ఝరిణీనిర్మల వారిపూరపరిపోషం బందియుం దన్మహా
    తరలక్ష్మీ పరిపూర్తిగాన కెసఁగెం దత్కల్పశాఖిప్రథన్.”

  1. ప్రౌఢభావ ప్రపూర్ణలౌ - ఒకకూరా కాకుజా (జపాన్ రచయిత) Book of Tea నుండి గృహీతము
  2. వినఁబడెను సంగీతము : Heard Melodies are sweet and those unheard off are sweeter still - Keats 'ode to a Grecian Urn' ఒక యాంగ్లకవి - వర్డ్సు వర్తు (క్రీ.శ. 1770-1850). సుప్రసిద్ధంగ్ల ప్రకృతి కవి; త్సిన్ చక్రవర్తి: చైనా సార్వభౌముఁడు
  3. పరిపూఁదోటలు : వసుచరిత్ర ఆ.1, ప. 108

________________________________________________________________________________________

20

వావిలాల సోమయాజులు సాహిత్యం-4