Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పూలు లేని దేశము సకల సద్గుణశోభిత యగు నాలు లేని సంసారము ముగ్ధహాసము లేని ముఖము. సిత శార వర్ణములతో నవరసోల్లాసములతో ననంత భావనల కాధారభూతములైన సుమసంతానములపై నే దేశమం దెవ్వరి కెక్కాలమునఁ గోర్కె వొడుమదు? కాలోచిత సమస్తైశ్వర్యముల నయ్యవి విలసిల్లుట వెంగలులు కాని యే దేశీయు లర్థింపరు? మంగళ ప్రదములు మహిమాఢ్యములు నైన వాని సౌభాగ్యగరిమఁ గని యే దేశీయులు ప్రహర్షహృదయులు కారు?

పుష్పములు పరమేశ్వరహాసస్వరూపములు. మాతృశ్రీ ప్రకృతి రుచిరాభరణాంగ రాగములు. ఇట్టి వీనితోఁ బరిచయము లేక [1]"బుద్ధత్వ'మబ్బదు. పురుషోత్తమప్రాప్తి కలుగదు. ఇంతయేల? ఆ హిరణ్యగర్భుఁడే జగత్కారణనాభీసరోజ సంభవుఁడు కదా! ఊహింప సర్వసృష్టి యొక సుమనమగుటయు గోచరింపకపోదు.

రసలుబ్ధమైన లోకమున ననురాగాభిమానములు [2]సాత్మ్యములు. సామాన్య వ్యక్తి మొదలుగ సర్వసంగపరిత్యాగులై మునివృత్తిఁ జేకొనిన మహర్షులవఱ కియ్యది తరతమ భేదములతో నొప్పుచున్నది. కాలదేవతాదుహితలగు ఋతుకన్యలకు నిట్టి యనురాగాభిమానములున్నవి. ఒక ఋతుకన్యకు నచ్చిన కుసుమవిభేదము మఱియొక ఋతుకన్యకమానసమును మఱల్పఁలేదు. ఒక ఋతుకన్య పెంచి పాలించిన పూదోటను మఱియొక ఋతుకన్య చీకాకు పఱచి చిత్తమున నానందానుభూతి నొందును. శతపత్రములపై శరత్తునకు మక్కువ మిక్కుటము. బాలకుందములపై హేమంతమున కనురాగ మధికము. లోధ్రములఁ గని శిశిరము రోమాంచకంచుక యగుచున్నది. శిరీషములన గ్రీష్మము పడిచచ్చును. కదంబములపై వర్షమునకు గాఢవాంఛ. ఆయా ఋతుకన్యల యభిమానానురాగములఁ జూఱఁగొనిన పుష్పము లాయా కాలముల నవనవోన్మేషశాలినులై నిత్యనవ్యావతారములఁ బ్రవర్తిల్లుచుఁ గొన్ని ప్రయోజనముల సాధించి నిర్యాణము నొందును.

అల్పముగ నైననేమి, యనల్పముగ నైననేమి సకలర్తువులును బుష్పసమయములే. అయ్యు నీ కమనీయకీర్తి వసంతకాలమున కబ్బినది. వసంతము మల్లియలది. ఇది మల్లికామాసమగుట మహాకవులెఱింగి యుండుటచే వసంత పుష్పావిర్భూతిని వర్ణించుపట్ల 'స్థాలీపులాకము'గ మల్లికావిలాసముల నిరూపించుటయందు మనసు గొందురు. [3]'నిఋతి దిగ్వాయుపతి వసంత ఋతుశోభ లీను చూలాం' డ్రగు మల్లియల మనోహరవిన్యాసములు దర్శించిన మహాకవి కందు సారవదాంధ్ర సాహిత్య

సౌమనస్యము లిట్లు గోచరించినవి.

  1. సత్యరథమునకు - కవి ఋతస్య పద్మభిః అని ప్రమాణము, బుద్ధత్వము బౌద్ధులకు నిర్యాణము చరమసిద్ధి. ఇదియే బుద్ధత్వము.
  2. సాత్మ్యములు : సహజలక్షణములు; శతపత్రములపై కాళిదాసు మేఘ. సం. 1, శ్లో. 22.
  3. నిఋతి దిగ్వాయువతి - శ్రీ విశ్వనాథ ఋతుసంహారము బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మహాకవి భర్తృహరి శతకత్రయిలోని శృంగార శతకమును "శంభు స్వయంభు హరయో హరిణేక్షణానాం, యేనా క్రియంత సతతం గృహ కుంభదాసాః, వాచామగోచర చరిత్ర విచిత్రితాయ తస్మై నమో భగవతే కుసుమాయుధాయ” అను శ్లోకముతో నారంభించినాఁడు.

________________________________________________________________________________________

18

వావిలాల సోమయాజులు సాహిత్యం-4