పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/17

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

పుష్పలోకము


ఆదిత్యవర్ణే తప సో౽ధి జాతో
వనస్పతి స్తవ వృక్షో౽ థబిల్వః |
తస్య ఫలాని తపసానుదన్తు
మాయా న్తరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః ॥ (శ్రీ సూక్తము)

(సూర్యుని వంటి వన్నెగల్గిన లక్ష్మీ! మొదట నీ యనుగ్రహమువలన నీ హస్తమునుండి పువ్వులు లేకుండఁగ నే ఫలించునట్టి బిల్వవృక్షము జన్మించినది. ఆ పాదపము బాహ్యాంతరింద్రియ సంబంధమగు దారిద్య్రమును బోఁగొట్టుఁగాక!)

ప్రతిభాభియోగ్యతచే స్వర్గమునందలి సౌవర్ణ రూపముల ద్రష్టయై దర్శించువాఁడు కవి. దర్శితములైన యేతచ్చాంపేయ రూపములకుఁ ద్వష్టయై బాహ్యాకృతులఁ గల్పించి రసమయ జగత్సృష్టిఁ గావించువాఁడు కవి! కవి సౌందర్య రసమునం దావిర్భూతుఁ డగును. అతని[1] సరసహస్తమునుండి మధువు స్రవించును.

జగద్రష్టయుఁ ద్వష్టయు నగు హిరణ్యగర్భుఁ డాదికవి కాదికవి. అతని హస్తద్వారమున వెల్లివిరిసి లోకమును మధుమంతముగ నొనర్చిన కృతులలోఁ బుష్పలోకము రమ్యాతి రమ్యమైనది. సమాధినిష్ఠుఁడై సృష్టికావ్య 'కృత్యాది'ని దానె కోమలకుసుమమై స్రష్ట నారాయణ నాభీసరోజ ద్వితీయమన నొప్పి యుండును. ఆదిత్య ప్రథముఁడైన యా విష్ణుని యమృతావలోకనము నర్థించి యుండును.

పరమేష్ఠి ప్రకటించిన యపూర్వభావభంగిమలే ప్రసూనములు. ఈ జగచ్ఛిల్పి కవి! 'కవి సత్యరథమునకుఁ గట్టఁబడిన యశ్వము!!' ఇది సూనృతమార్గమునఁ బరుగిడి యానందధామమును జేర్చును. ఈ కారణముననే స్రష్ట మానవ నయన మనోనయనాహ్లాదనమే సుమసృష్టికి పరమప్రయోజనముగ భావించి యుండునని భావుకలోక మూహించినది. శాబ్దికు లీ రసవద్రహస్యమును గుర్తించి తొలి యుషస్సులు తోఁచిననాఁడే పుష్పమునకు సుమన మనియు, నాకాధిపతి వనమునకు

నందనమనియు నామకరణమొనర్చిరి.

  1. అతని సరస - కవిర్హి మధుహస్తయః అని శ్రుతి.

మణిప్రవాళము

17