Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంభవిస్తుందా? అని. ఇటువంటి ప్రశ్న ఒక శతాబ్దానికి పూర్వం కలిగినట్లయితే దానికి 'ఏ ప్రమాదమూ లేదని వెంటనే సమాధానం వచ్చి ఉండేది.


ఇది కేవలమూ శాస్త్రీయ యుగము. ప్రాచీన యుగంలో మతవక్తలు సంఘంలో ఉచ్చస్థితిని పొంది ఉన్నారన్న సంగతి లోక ప్రసిద్ధము. నేడు ఆ ఆ స్థితిని - - ప్రజాయుగంలో - వైద్యులు పొందినారు. యథాతథంగా బ్రహ్మచర్యం వల్ల ఎటువంటి ప్రమాదమూ లేదు. కానీ కొందరికి ఉపకరిస్తుంది. కొందరికి ఉపకరించదు. - అని వైద్య శాస్త్రజ్ఞులు చెపుతున్నారు. కామశక్తి విశేషంగా లేనివాళ్ళు బ్రహ్మచర్యాన్ని అవలంబిస్తే ప్రమాదం లేదు కాని, వ్యతిరేకులు స్త్రీ సంభోగాన్ని అరికట్టితే కామోన్మాదులు (Sexual Neurotics) అయినా అవుతారు లేదా ముష్టిమైథునానికి అలవాటు పడతారు ఇది వైద్యుల అభిప్రాయము. అందుకే బ్రహ్మచర్యం అందరికీ మంచిదని గానీ, చెడ్డదని గానీ నిర్ణయించడానికి అవకాశం లేదన్నమాట.


అంతేకాకుండా, స్త్రీ సంబంధం లేనంత మాత్రాన ఒక వ్యక్తి కామ రహితుడు కాదని బ్రహ్మచారి అనిగానీ అనటానికి వీలు లేదని జాతి శాస్త్రజ్ఞులంటున్నారు. ప్రాచ్య గ్రంథాలు కూడా అదేవిధంగా పలుకుతున్నాయి. బ్రహ్మచర్యావలంబకులకు కామసంబంధమైన భావనలూ, కాముక స్వప్నాలూ రాకూడదు. నిజమైన బ్రహ్మచర్యము కేవలము శారీరక భోగంతో ఆగిపోదు. అంటే బ్రహ్మచారి మనస్సులో ఏ విధమైన కామమూ ఉండకూడదు.


హేవ్ లక్ ఎల్లిస్ మహాశయుడు బ్రహ్మచర్యాన్ని గురించి వ్రాస్తూ ఇలా అన్నాడు. “సామాన్యంగా 'చేస్టిటీ' (బ్రహ్మచర్యం) అనే శబ్దం శారీరక సంభోగాన్ని గురించి మాత్రమే లోకంలో వాడుకలో ఉన్నది. కానీ ఆ శబ్దం అంతమాత్రంతో ఆగిపోదు. అంతకంటే ఆనంతమైన అర్థాన్ని ప్రతిపాదిస్తుంది” అని. అందువల్ల మత, ధర్మ, వైజ్ఞానిక వివక్ష లేకుండా బ్రహ్మచర్యం ఒక గుణంగానే పరిగణిత మౌతూ ఉన్నది. పూర్వకాలపు మతధర్మాల మీద విప్లవం జరిపి స్వేచ్ఛను పొందినానని భ్రమపడే నేటి సభ్యప్రపంచం బ్రహ్మచర్యం మీద దాడి చేస్తూ ఉన్నది. అందుచేత ఒక వంక నుంచీ బ్రహ్మచర్య మేమిటి? మానవులకు కామేచ్ఛ సహజం, దాన్ని తీర్చుకోవలసిందే ననీ, వివాహాది నియమాలను త్రోసిరాజనవలసిందేననీ వినిపిస్తున్నది. ఏ దేశంనుంచైతే ఈ నినాదాలు వినిపిస్తున్నవో పూర్వం ఆ దేశంలోనే కామోపభోగానికి కొన్ని నియమాలున్నట్లు తెలుస్తున్నది. అయితే - కామేచ్ఛను తీర్చుకునే ఇతర అవకాశాలూ కనిపిస్తున్నవి.


సంస్కృతి

187