కానీ విప్లవం చేసి సాంఘిక ఆర్థిక రాజకీయ స్థితుల్లో మార్పునూ, స్వేచ్ఛనూ పొందిన ఆ దేశం నేడు కామస్వేచ్ఛ (Sex-licence) కోరుతున్నది.
సామాన్య స్త్రీ పురుషులలో మిగిలిన అన్నిటితో పాటే కామమూ సామాన్యంగా
ఉంటుంది. దానివల్ల ఎటువంటి ప్రమాదమూ లేదు. వైజ్ఞానిక, మానసిక వికాసాల
విషయంలో కలిగే తృష్ణ వలెనే అదీ పనిచేస్తుంది. అత్యద్భుతాన్ని తెలుసుకోవలెననే
ఆసక్తి ఎటువంటిదో కామమూ అటువంటిదే.
నీతిశాస్త్రజ్ఞుడు సంఘం అంగీకరించిన మార్గాలలోనే కామతృప్తిని పొందటమే
స్త్రీకి గానీ, పురుషునికి గానీ శ్రేయస్కరమని అభిప్రాయమిస్తాడు. అటువంటి మార్గాన్ని
అనుసరించలేని వ్యక్తి దానిని చంపుకోవటం గానీ, లొంగదీసుకోవటం గానీ
మంచిదంటాడు. అయితే అటువంటి విధానాన్ని అనుసరించటము ఎంత వరకు
సాధ్యము? అనేది ప్రశ్న.
మనస్సును మార్చుకున్నా - లేక స్నాయువులకు నిస్సత్తువ కల్పించుకున్నా
కామము నశించదు. కామాన్ని చంపుకునేందుకు కొందరు కొన్ని క్రీడలు కనిపెట్టారు.
దానివల్ల కూడా విశేష ప్రయోజనం కనిపించలేదు. పరిపూర్ణమైన అలసట
(Exhaustion) కలిగేదాకా క్షుద్బాధగాని, కామక్షుత్తుగానీ నిర్మూలితం కాదు. మత
విషయకమైన మనస్తత్త్వం కొంతగా ఉపకరించవచ్చునేమో గాని, అది లేనివాళ్ళకు
కామాన్ని లొంగదీసుకోవటమనేదే లేదు. అటువంటివారు, సంఘం వారి
ఆనందానుభవాన్ని అరికట్టితే, స్వీయ - కాములు (auto-erotic) గా పరిణమిస్తారు.
దానివల్ల లోకానికీ, సంఘానికి మరింత తీరని ప్రమాదం సంభవిస్తుంది.
ఉదాత్తమైన ఒక ఆదర్శం ఉంటే కామం లొంగక పోదు. ఆదర్శవిహీనంగా
కామాన్ని లొంగదీసుకోటానికి యత్నిస్తే అందువల్ల ప్రయోజనం కంటే ప్రమాదమే
విశేషము.
(ఆంధ్రపత్రిక-28-1-48, వారపత్రిక)
188
వావిలాల సోమయాజులు సాహిత్యం-4