పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చట్టసమ్మతము చేయవచ్చును. స్త్రీలోనూ మానసికాభివృద్ధికి మాతృత్వాన్ని కావాలని కొందరు కోరుకుంటారు. కొందరు భర్త అంటే మనస్సు అంగీకరించకపోయినా పిల్లలమీద అపేక్షవల్ల వివాహం చేసుకుంటారు. పిల్లలు కావాలని ప్రతి స్త్రీ కోరుతుంది. కానీ అందుకోసం పురుషుడికి దాస్యం చేయటానికి అంగీకరించదు” అని.

అయితే పిల్లలు ఎలా వస్తారు? పెంచుకోవచ్చును, లేదా మరో స్త్రీ పిల్లలను దొంగిలించవచ్చును. ఇతరుల పిల్లలను పెంచుకున్నా, దొంగిలించినా తృప్తి కలుగకపోవటము మానవ లోకానికి సహజగుణం. ఇందులో రక్తసంబంధం కనిపించదు. ప్రసవ వేదన లేదు. ఆత్మీయత లేదు. ఏమి సంతృప్తి? ఎక్కడి సంతృప్తి?

లోకంలో కొందరికి సహజంగా కామోద్రేకం ఎక్కువ. కొందరికి తక్కువ. కొందరిలో కామం మధ్యేమార్గాన్ని అనుసరిస్తుంది. ఎవరిలో కామం తక్కువగా ఉంటుందో వారిని జాతి శాస్త్రజ్ఞులు ఊనకాములు (Infra-sex) అని వ్యవహరిస్తారు. ఇటువంటివారికి కామోద్రేకం విశేషంగా ఉన్నవాళ్ళను చూస్తే ఈర్ష్య కలుగుతుంటుంది. అందువల్ల దాన్ని తగ్గించటానికి ఎంతో తంటాలు పడతారు. లోకంలో స్త్రీ పురుష సంబంధంలో వచ్చే నిబంధనలూ, తప్పులూ, పుక్కిటి పురాణాలూ అన్నీ ఈ ఊనకాముల మూలంగా కలిగేవేనని ఒక మతం వారి అభిప్రాయం. అంటే కామానికి సంబంధించిన విధినిషేధాలు పనికిరావని అభిప్రాయం కాదు. ఊనకాముల అశక్తత వల్లకూడా లోకానికి కొంత మేలు కలిగింది.

పూర్వకాలం మతప్రవక్తలు గుర్తించినట్లు కామశక్తిని గమనించిన వాళ్ళు అరుదు. విచ్ఛేదన (Divorce) మాట ఎత్తకుండానే ఎన్నో ఆటంకాలు కల్పించారు. జీవన విధానంలో అనేక నిష్టానియమాలను ఏర్పరచి నేడు విచ్చలవిడిగా తాండవించే కామానికి కళ్ళాలు బిగించినారు. కామశక్తిని సమస్తమూ భగవంతుని మీద కేంద్రీకరించే ఆధ్యాత్మిక ప్రపంచాన్ని సృజించారు.

క్రైస్తవ మతం పావిత్య్రాన్ని ప్రథమంలో అంగీకరించిన కేవల నీతివాదులు ఏమంటున్నారో గమనిద్దాము. వివాహ విధానాన్ని సంపూర్ణంగా మార్పు చేయటం కంటే ఏ కొద్దిమంది వ్యక్తులో మిగిలిన సంఘం కోసం బలి కావడం మంచిదని వారు అభిప్రాయ పడుతున్నారు. సంఘానికి శ్రేయస్సు అందువల్ల లభించేటట్లయితే కొందరిని త్యాగం చెయ్యమని కోరటంలో తప్పుండదు.

అయితే అప్పుడు మరో ప్రశ్న బయలుదేరుతుంది. జీవిత పర్యంతమూ బ్రహ్మచర్యాన్ని అవలంబిస్తే మానసికంగా కానీ శారీరకంగా కానీ ఏమన్నా ప్రమాదం


186

వావిలాల సోమయాజులు సాహిత్యం-4