ఆంగ్లసాహిత్యమున గద్యము బహువిధ వస్తు విన్యాస వైభవములతో విలసిల్లి విస్తరిల్లినది. దేశీయ సాహిత్యముల కా సాహిత్యముతో సన్నిహితసంబంధ మేర్పడిన పిమ్మట వీని యందును గద్యము బహువిధగతులు నొప్పుచున్నది. ఒకనాఁటి యాంధ్రగద్యకావ్యతరువు నేఁడు వివిధ శాఖోపశాఖలతో విస్తృతమై మహావృక్షరూపము నొందుచున్నది. నవలాశాఖయందు జన్మించిన 'చెలియలికట్ట' 'వేయిపడగలు' 'ఏకవీర' 'హిమ బిందు' ‘నారాయణభట్టు' 'రుద్రమదేవి' విశ్వసాహిత్యమున విశిష్టస్థాన మాక్రమింపదగిన యుత్కృష్టకృతులు. అనతికాలమున నిందుఁ గథాశాఖికను బుట్టిన పూవు ప్రపంచ ప్రథమ గణ్యమగుట యాంధ్రుల కతిముదావహమైన యంశము, విమర్శ, వ్యాస శాఖలు బహుముఖవ్యాప్తములై వర్ధిల్లుచుండుట గన నచిర కాలమున నిం దమోఘరచన లుద్భవిల్లఁగల వనుట యత్యుక్తి కాఁజాలదు.
కొలఁది కాలమునుండి నా లేఖిని గద్య మహావృక్షము నందలి
వ్యాసశాఖపై నభిమానము వహించినది. అది యా శాఖ యందలి
సర్వసామాన్యవిలాసముతోఁబాటు వినూతనము లైన విన్నాణముల
వెదకుచున్నది. ఆ యన్వేషణఫలితములఁ దొలుదొల్తఁ బత్రికా
ముఖమునఁ బ్రకటించి యాంధ్ర రసజ్ఞలోక మొనఁగిన
యపూర్వప్రోత్సాహ దోహదమున నేఁడు 'మణిప్రవాళ' రూపమునఁ
బ్రకటించుచున్నాఁడను.
నామకరణము కృత్యాద్యవస్థలలో నాద్యము. తొలుత
నప్పుడప్పుడు నీ వ్యాసముల నొక సమాహారముగఁ బ్రకటించు కోర్కెలు
వొడమి నపుడు 'శక్రచాపము', 'పుష్పలోకము', 'మణిమేఖల' మొదలగు
విచిత్ర నామములు తోఁచినవి. ఈ సమాహృతి యందుఁ గొన్ని
వ్యాసములలోఁ గిమ్మీర కాంతులు కన్పింపక పోవుటచే ‘శక్రచాపము”ను
గ్రహింపలేదు. పుష్పలోకమున నిర్గంధకుసుమము లుండుట పరిపాటి
యైనను గొన్ని వ్యాసము లట్టివగుట 'పుష్పలోకము'పై బుద్ధి పోలేదు.
మణులు కొన్ని మాత్రమగుట వలనను, మేఖలలు మోటగుట వలనను
నది తృప్తి యొసఁగలేదు. తుదకు బహుకారణముల వలన