‘మణిప్రవాళము’పై మనసు పడితిని. నా కావ్య నేపథ్య గృహభాగము నీ రీతి మీ ముందుఁ బ్రదర్శించుచున్నందుకు రసికలోకము మన్నించుఁ గాక!
గ్రంథచౌర్యబుద్ధితోఁ గాక మధ్యమమణిన్యాయము ననుసరించి
ప్రాచీనార్వాచీన భావుకుల మనోహరభావములను మనోజ్ఞచిత్రముల
నెడనెడ గ్రహించి పొదిగి స్వాయత్త మొనర్చుకొనుట యీ
సమాహారమునందుఁ గన్పించును. అవి యన్నియును మణులు, నా
యల్పబుద్ధికిఁ దోఁచినవి ప్రవాళములు. ఈ కారణమునను నీ
సమాహృతి మణిప్రవాళము.
మణిప్రవాళము ప్రాచీనమలయాళ భాషయందు మహాకవుల
నాకర్షించిన మనోహర రచనా మార్గము, సంస్కృతపద ఘటిత
సమాసభూయిష్ఠమై తుదిని దేశీయ ప్రత్యయములఁ జేర్చుట దీనికి
లక్షణము. ఇట్టి కలఁగలపు మెలపులతోఁ గర్ణాటక సంగీతమున
‘మణిప్రవాళ' మను నొక శైలియున్నది. ఇట్టి భాషాశైలీ విశేషములను
గొన్ని వ్యాసముల నిరూపించుటకు యత్నించితిని.
అలంకార శాస్త్రముల సమాసబహుళమగు నుత్కళికాప్రాయము,
నల్పసమాస యుతమైన చూర్ణిక, ఛందోనిబద్ధ వృత్తవాసనలు గల
వృత్తగంధి, సమాసరహితమైన ముక్తకము గద్యశయ్యావిభేదములుగఁ
జెప్పఁబడినవి. ప్రకరణానుకూలముగ నీ మణిప్రవాళమున నీ
చతుర్విధ గద్యరచనావిచ్ఛిత్తిని జూపించుటయే నా సంకల్పము.
మణిప్రవాళమున గొన్ని వ్యాసములు లూతాతంతు సద్మ
సదృశములు, కొన్ని 'బహులోద్యాన సంచారణ చణ షట్చరణసమానీత
పుష్పాసవ సంభృత మధుకోశ సదృశములు.' కొన్ని స్వర్ణకార సామర్థ్య
నిరూపణములు. ఈ యూర్ణనాభ, సారంగ, కళాదులకుఁ గల
ప్రతిభావ్యుత్పన్నతలలో నే సహస్రాంశము లీ రచనయందున్నట్లు
రసజ్ఞలోకము గుర్తించినచో నేను ధన్యుఁడను!
ప్రాచీనములకుఁ బ్రతిబింబములను గాని, యాధార
రహితములైన కేవలోత్పాద్యములను గాని యామోదింపని బుద్ధి యిట్టి