Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కృత్యాది

ఛందోబద్ధములైన కావ్యము లవతరించిన పిమ్మటనే సాహిత్య లోకమున గద్యకృతు లుత్పన్నములైనవి. ఈ వాక్యము ప్రపంచము నందలి సర్వసాహిత్యముల పట్ల నన్వయించు నొక సుసత్యము. దీనినిబట్టి నిత్యవ్యవహారమున గద్యము లేదని కాదు. కళా విన్యాసాత్మకములైన రసవద్రచన లీసాహిత్యవిభాగము నందుఁ బద్యమయ కృతులకంటెఁ బూర్వము పుట్టలేదని యభిప్రాయము.

“గద్యం కవీనాం నికషం వదంతి” - ఇది దేవభాషాగద్యను గూర్చిన యొక సూక్తి. ప్రాచీన భారతమున గీర్వాణవాణి యందు గద్యము బహువిధగతుల విలసిల్లినది. అలంకార శాస్త్ర గ్రంథముల వలన నాఖ్యాయి కాది పంచవిధ గద్యములుఁ బ్రవర్తిల్లి నట్లవగత మగుచున్నది. 'బాణోచ్చిష్ట మిదం జగ త్తను నాభాణకమునకు స్టానమై కాదంబరీ, హర్షచరిత్రల విశేషవిఖ్యాతి గడించుకొనిన మహాకవి బాణభట్టారకుఁ డన్యకవి పాంథగమ్యములు కాని మనోహర మార్గముల విలసిల్లి గద్యప్రపంచ స్వర్ణసింహాసన మధిష్టించియున్నాండు.

నన్నయ భట్టారక మహాకవిముఖమున నాంధ్రభాషయందాది కావ్యము చంపువుగ జన్మించినది. చంపూసరణినే పురాణ, ప్రబంధకవు లభిమానించిరి. అందుచే బహుకాలమునకుం బిమ్మటం గాని ప్రత్యేక గద్య కావ్యములు పుట్టుటకు వీలు కలుగలేదు. నేఁటికిని మహాకావ్య లక్షణములు కలిగి ప్రాచీన ప్రబంధ సరణి ననుసరించుచు శ్రవణ బెళగొళలోని గోమరేశ్వరునివలె గుండె లవియం గన్పించుఁ గద్యప్రబంధము జన్మింపలేదనుట సాహసోక్తి కాదేమో! అట్టి కృతి వినిర్మింప నొక బాణ భట్టారకుం డాంధ్రసాహిత్యావని కే నాఁ డవతరిల్లునో!!